India Ship Attacked: భారత్‌కు ఇరాన్ మరో షాక్.. గుజరాత్‌కు వస్తున్న నౌకపై దాడి, సీజ్

ఐదు మిత్ర దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని టెహ్రాన్ హామీ ఇచ్చినప్పటికీ.. జగ్ అర్నవ్, సన్మార్ హెరాల్డ్ అనే రెండు భారతీయ నౌకలపై ఇరాన్ నౌకాదళం కాల్పులు జరిపిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.

  • Published on- April 22, 2026 / 06:57 PM IST

India Ship Attacked: హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న కార్గో షిప్స్ పై ఇరాన్ దాడులు కంటిన్యూ చేస్తోంది. తాజాగా గుజరాత్‌కు వస్తున్న ఒక సరుకు రవాణా నౌకతో సహా రెండు నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గత వారం కీలకమైన ఇంధన కారిడార్ హర్మూజ్‌ను దాటడానికి ప్రయత్నించిన భారత జెండా ఉన్న రెండు నౌకలపై దాడి జరిగిన సంగతి తెలిసింది. ఇప్పుడు మరోసారి అటాక్ జరిగింది. ఈ సంఘటన ఇరాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలను పెంచడం ఖాయం అంటున్నారు నిపుణులు.

పనామా జెండా కలిగిన MSC ఫ్రాన్సెస్కా, లైబీరియా జెండా కలిగిన ఎపామినోడెస్ అనే రెండు నౌకలు ఇప్పుడు IRGC అదుపులో ఉన్నాయని, వాటిని ఇరాన్‌కు తరలించారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ నివేదించింది. గ్రీకు యాజమాన్యంలోని యూఫోరియా అనే మూడవ నౌకను కూడా లక్ష్యంగా చేసుకున్నారని, అది ప్రస్తుతం ఇరాన్ తీరంలో చిక్కుకుపోయిందని తెలిపింది.

ముంద్రా పోర్టుకు వస్తున్న నౌక..

సముద్ర ట్రాఫిక్ డేటా ప్రకారం ఎపామినోండాస్ గుజరాత్‌లోని ముంద్రా పోర్టు వైపు వస్తోంది. అది దుబాయ్ నుండి వస్తోంది. అయితే, ఆ నౌకలకు ‘అవసరమైన అనుమతి’ లేదని, ‘నావిగేషన్ వ్యవస్థలను తారుమారు చేసి’ సముద్ర భద్రతకు ప్రమాదం కలిగించిందని ఇరాన్ నౌకాదళం పేర్కొంది.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ నియంత్రణలో ఉన్న హర్ముజ్‌ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిగాయని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) తెలిపింది. ఈ జలమార్గంపై ఇరాన్ పట్టు సాధించడం వల్ల చమురు సరఫరా స్తంభించిపోయి, ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. తుపాకీ కాల్పులు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ల దాడిలో నౌకలలో ఒకదాని బ్రిడ్జ్ (కేంద్ర కమాండ్ సెంటర్) దెబ్బతిన్నట్లు సమాచారం. సిబ్బందికి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.

అమెరికా మెరైన్ దళాలు ఇటీవల తమ నావికా దిగ్బంధనంలో భాగంగా ఒమన్ గల్ఫ్ సమీపంలో ఇరాన్ జెండా ఉన్న రెండు సరుకు రవాణా నౌకలను స్వాధీనం చేసుకుంది. దీనికి ప్రతీకార చర్యగా ఈ దాడి, సీజ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే, బయటకు వెళ్లే నౌకలపై అమెరికా విధించిన దిగ్బంధనం తాజా వివాదానికి కారణం. ఏ శాంతి చర్చలకైనా ఈ దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవడాన్ని టెహ్రాన్ ముందస్తు షరతుగా పెట్టింది. అయితే, నావికా దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ చమురు ఆదాయాలను అడ్డుకుని, దాని ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడమే దీని లక్ష్యం.

గత వారం రెండు భారతీయ నౌకలపై దాడి..

ఐదు “స్నేహపూర్వక” దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని టెహ్రాన్ హామీ ఇచ్చినప్పటికీ.. జగ్ అర్నవ్, సన్మార్ హెరాల్డ్ అనే రెండు భారతీయ నౌకలపై ఇరాన్ నౌకాదళం కాల్పులు జరిపిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.

భారత జెండా కలిగిన బల్క్ క్యారియర్ ‘జగ్ అర్నవ్’ సౌదీ అరేబియా నుండి భారతదేశానికి ప్రయాణిస్తోంది. మరోవైపు, ‘సన్మార్ హెరాల్డ్’ ఇరాక్ నుండి భారతదేశానికి చమురును రవాణ చేస్తోంది. ఏప్రిల్‌లో సుమారు 10 భారతీయ నౌకలు ఈ కారిడార్ గుండా ప్రయాణించాయి. ఈ సంఘటన ఇరాన్‌లో తెర వెనుక చక్రం ఎవరు తిప్పుతున్నారనే ప్రశ్నలను లేవనెత్తింది. శక్తివంతమైన ఐఆర్‌జిసి తెర వెనుక నుండి చక్రం తిప్పుతోందని, రాజకీయ నాయకత్వాన్ని పక్కన పెట్టిందని పలు నివేదికలు సూచించాయి. ఈ దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్ రాయబారిని పిలిపించి మాట్లాడింది. ఈ సంఘటనపై తన తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.