డ్రాగన్ తోక జాడిస్తే… భారత్ చూస్తూ ఊరుకుంటుందా? డ్రాగన్ తోక కట్ చేసే వ్యూహం పన్నుతుంది…

  • Publish Date - September 1, 2020 / 11:14 PM IST

డ్రాగన్ తోక జాడిస్తే… భారత్‌ చూస్తూ ఊరుకుంటుందా? డ్రాగన్‌ తోక కట్‌ చేసే వ్యూహల్ని అమలు చేస్తోంది. సౌత్ చైనా సముద్రంలో భారత యుద్ధ నౌకలు ఎంట్రీ ఇచ్చాయి. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా దుందుడుకు వైఖరికి చెక్ పెట్టేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. విస్తరణవాద కాంక్షతో రగలిపోతున్న డ్రాగన్‌కు భారత్ ఊహించని ఝలక్ ఇచ్చింది.

తాజాగా దక్షిణ చైనా సముద్ర జలాల్లో యుద్ధ నౌకను భారత్ మోహరించింది. గాల్వాన్ ఘర్షణ తర్వాత దూకుడు పెంచిన భారత్.. దేశ రక్షణ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో దక్షిణ చైనా సముద్ర జలాలపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా చేస్తున్న
ప్రయత్నాలకు దీటుగా భారత్ తన యుద్ధ నౌక‌ను పంపింది.



ఈ నౌక అక్కడే ఉండి చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచింది. సమీపంలోని అమెరికా యుద్ధ నౌకలతో సంప్రదింపులు జరిపి సమాచారాన్ని పంచుకుంటోంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి యుద్ధ నౌకను అత్యంత రహస్యంగా తరలించడం విశేషం. దక్షిణ చైనా సాగరంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధనౌకలూ సంచరిస్తున్నాయి. అక్కడ మోహరించిన భారత యుద్ధనౌక.. రహస్య సాధనాల ద్వారా వీటితో కమ్యూనికేషన్‌ సాగించింది. ఇతర దేశాల యుద్ధనౌకలూ తమ కదలికల్ని మన నౌకకు తెలియజేశాయి. ఈ ఆపరేషన్‌ మొత్తాన్నీ భారత్‌ గోప్యంగా సాగించింది.



ఇదే సమయంలో అండమాన్‌కు సమీపంలోని మలాకా జలసంధి వద్ద కూడా భారీగా యుద్ధనౌకలను భారత్‌ మోహరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించడానికి చైనా నేవీ ఇదే మార్గాన్ని ఉపయోగించుకుంటోంది. వీటి కదలికలను కట్టడి చేయడానికి ఈ చర్యను మన దేశం చేపట్టింది. చైనా వాణిజ్య నౌకలు కూడా ఎక్కువగా ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి.

తూర్పు, పశ్చిమ తీరాల్లో శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే… తిప్పికొట్టే సామర్థ్యం నౌకా దళానికి ఉందని నేవీ చెప్తోంది. ఆఫ్రికా ఖండంలోని జిబౌటీ వద్ద చైనా యుద్ధనౌకల కదలికలపై కన్నేసి ఉంచామని పేర్కొన్నాయి. మన మోహరింపుల వల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంపై పూర్తి పట్టు సాధించడానికి వీలైందని వివరించాయి.



మరోవైపు, హిందూ మహా సముద్రంలో యుద్ధ నౌకలను భారత్ భారీగా మోహరించింది. చైనా నౌకలు ప్రయాణించే అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని మలక్కా స్ట్రెయిట్స్‌పై నిఘాను పటిష్టం చేసింది. చైనా నౌకాదళం కదలికలపై భారత యుద్ధ నౌకలు కన్నేసి ఉంచాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ నేవీ సన్నద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

చైనా దూకుడు నేపథ్యంలో… సాగర జలాల్లో పోరాట సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత నౌకాదళం వ్యూహ రచన చేస్తోంది. మలాకా జలసంధి నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా యుద్ధనౌకల రాకపోకలను సమర్థంగా పర్యవేక్షించేందుకు స్వయంచోదిత జలాంతర నౌకలు, మానవరహిత వ్యవస్థలు, ఇతర సెన్సర్లను తక్షణం సమకూర్చుకోవాలని యోచిస్తోంది. భారత్‌ గట్టిగా ఎదురు నిలవడంతో చైనాకు ఏం చేయాలో పాలుపోవట్లేదు.

వెన్నులో వణుకు పుట్టడంతో కొత్త నాటకాలు మొదలుపెట్టింది. భారత యుద్ధ నౌకలతో మాకు నష్టం జరుగుతోందంటూ నెత్తీనోరూ బాదుకుంటోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా, భారత్‌ సైనికాధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి.



ఇటీవల జరిగిన చర్చల్లో దక్షిణ చైనా సముద్రంలోకి భారత్ యుద్ధ నౌక మోహరింపుపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల తమ సైనిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా ప్రభుత్వానికి సౌత్ చైనా సముద్రం చాలా కీలకంగా ఉంది. దీంతో మరే ఇతర దేశాలు కూడా ప్రవేశించడానికి వీల్లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శత్రువులను పెంచుకుంటూ పోతున్న చైనాకు.. తాజా పరిణామం మింగుడు పడట్లేదు.