Melania Trump: అలాస్కాలో చర్చల వేళ.. పుతిన్‌కు మెలానియా ట్రంప్ లేఖ..! అందులో ఏముందంటే?
అలాస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ వేళ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) వ్యక్తిగతంగా పుతిన్‌కు ఓ లేఖను..

Melania Trump
Melania Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సుమారు ఐదేళ్ల విరామం తరువాత అలాస్కా వేదికగా సమావేశం అయ్యారు.
యుక్రెయిన్, రష్యా యుద్ధానికి బ్రేక్ వేసేందుకు జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అయితే, ఇరువురు నేతలు మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.
ట్రంప్, పుతిన్‌లు భేటీ అనంతరం సయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎలాంటి ఒప్పందం జరగలేదని, అయితే, చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరువురు నేతలు ప్రకటించారు.
దీనిపై మరోసారి జరిగే సమావేశంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా పాల్గొంటారని, ఒప్పందం చేసుకోవాలని ఆయనకు సూచిస్తానని ట్రంప్ చెప్పారు.
తదుపరి భేటీ మాస్కోలో ఉంటుందని పుతిన్ తెలిపారు. అయితే, ట్రంప్, పుతిన్ భేటీ వేళ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
అలాస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ వేళ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) వ్యక్తిగతంగా పుతిన్‌కు ఓ లేఖను రాసినట్లు, ఆ లేఖను డొనాల్డ్ ట్రంప్ పుతిన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఇంతకీ మెలానియా రాసిన లేఖలో ఏముందంటే.. యుక్రెయిన్, రష్యాలోని పిల్లల దుస్థితిపై ఆమె లేఖలో ప్రస్తావించారు.
యుక్రెయిన్‌లో యుద్ధం ఫలితంగా జరిగిన పిల్లల అపహరణల గురించి ప్రస్తావించడం తప్ప లేఖలోని విషయాలను అధికారులు వెల్లడించలేదు.
ఇదిలాఉంటే.. రష్యా – యుక్రెయిన్ యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది చిన్నారులు తమ కుటుంబాలకు దూరమయ్యారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో దాడి అనంతరం తమ దేశానికి చెందిన వేలాది మంది చిన్నారులను రష్యా తీసుకెళ్లినట్లు యుక్రెయిన్ ఆరోపించింది. దీన్ని యుద్ధ నేరంగా అభివర్ణించింది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కార్యాలయం కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, యుద్ధభూమిపై దుర్భర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను రక్షిస్తున్నామని మాస్కో చెప్పుకొచ్చింది.