అలాస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం.. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిన భేటీ.. ఇద్దరు నేతలు కీలక కామెంట్స్.. భారత్‌పై సుంకాల గురించి..

అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన కీలక భేటీ (Alaska Meeting) ముగిసింది.

అలాస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం.. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిన భేటీ.. ఇద్దరు నేతలు కీలక కామెంట్స్.. భారత్‌పై సుంకాల గురించి..

Alaska Meeting

Updated On : August 16, 2025 / 7:40 AM IST

Alaska Meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య అలాస్కా వేదికగా కీలక భేటీ జరిగింది. యుక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఇద్దరు ప్రపంచ నాయకులు భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలపాటు వీరి మధ్య భేటీ జరిగింది. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశంలో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి.

భేటీ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్, పుతిన్ మాట్లాడారు.. ఈ సందర్భంగా భేటీలో చర్చకు వచ్చిన అంశాలపై వివరించారు. ట్రంప్ మాట్లాడుతూ.. భేటీ విజయవంతంగా ముగిసిందని, అనేక అంశాలపై చర్చ జరిపామని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందని, అయితే, కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదని ట్రంప్ చెప్పారు.

త్వరలో మరోసారి భేటీ..
చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్న ట్రంప్.. చాలా అంశాలను పుతిన్, నేను అంగీకరించామని చెప్పారు. అయితే, కొన్ని అంశాలపై మా మధ్య ఇంకా స్పష్టత రాలేదు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్ పై సంతకం చేసే వరకు ఒప్పందం తుది కాదని ట్రంప్ చెప్పారు. త్వరలో మరోసారి పుతిన్‌తో భేటీ అవుతానని పేర్కొన్నారు. త్వరలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు.

ట్రంప్ ఉండిఉంటే యుద్ధం వచ్చేదే కాదు..
రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ యుక్రెయిన్‌తో యుద్ధం గురించి కీలక కామెంట్స్ చేశారు. 2022లో ట్రంప్ అధికారంలో ఉండిఉంటే యుక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని, యుక్రెయిన్ తన పరిస్థితికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అలాస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని, అయితే, యుక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు రష్యా నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. అలాస్కా సమావేశం యుక్రెయిన్‌తో వివాదాన్ని ముగించడానికి ప్రారంభ స్థానంగా పుతిన్ అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని, ఇరు దేశాల మధ్య సంబంధాల విషయాల్లో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో సంబంధాలు ఏర్పర్చుకుందని తెలిపారు. అయితే, తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని ట్రంప్ చెప్పగా.. తుదపరి సమావేశం మాస్కోలో ఉంటుందని పుతిన్ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై 50శాతం సుంకాలు విధిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారని, ఆ కారణంగా భారత్ ఉత్పత్తులపై సుంకాలు పెంచుతున్నట్లు ట్రంప్ చెప్పారు. అలాస్కా భేటీలో పుతిన్, ట్రంప్ మధ్య భారత్ సుంకాల అంశం కూడా చర్చకు వస్తుందని భేటీకి ముందు అంతా భావించారు. కానీ, ఈ భేటీలో భారత్ ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. అయితే, పుతిన్‌తో జరిగిన చర్చలు సంతృప్తికరంగా సాగడంతో ట్రంప్ రాబోయే కాలంలో భారత్ దిగుమతులపై సుంకాలను ఇంకా పెంచే అవకాశం ఉండదని తెలుస్తోంది.