Donald Trump: పుతిన్‌తో భేటీ తరువాత.. భారత్‌పై అదనపు సుంకాల గురించి ట్రంప్ కీలక కామెంట్స్..

రష్యా దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాలు ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొంతకాలంగా హెచ్చరికలు

Donald Trump: పుతిన్‌తో భేటీ తరువాత.. భారత్‌పై అదనపు సుంకాల గురించి ట్రంప్ కీలక కామెంట్స్..

Donald Trump

Updated On : August 16, 2025 / 12:05 PM IST

Donald Trump: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) భేటీ అయ్యారు. ఈ భేటీలో యుక్రెయిన్‌తో యుద్ధం ముగింపు దిశగా చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పారు. అయితే, ట్రంప్, పుతిన్ భేటీ తరువాత రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాలు అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

Also Read: Melania Trump: అలాస్కాలో చర్చల వేళ.. పుతిన్‌కు మెలానియా ట్రంప్ లేఖ..! అందులో ఏముందంటే?

రష్యా దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాలు ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే. పుతిన్‌తో భేటీ తరువాత ఆ నిర్ణయంపై ట్రంప్ కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పుతిన్‌తో చర్చల తరువాత మీడియా సమావేశంలో.. పుతిన్‌తో జరిగిన సమావేశంలో యుక్రెయిన్‌పై ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోకపోవడంతో గతంలో మీరు పేర్కొన్నట్లు రష్యా నుంచి చమురు కొనుగోలుదారులపై సుంకాల పెంపు ఉంటుందా అని ఫాక్స్ న్యూస్ ప్రశ్నించగా.. ట్రంప్ సమాధానం ఇచ్చారు.

‘‘ఈరోజు జరిగిన పరిణామాల తరువాత రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాల పెంపు గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని నేను భావించడం లేదు. దీనిపై రెండు, మూడు వారాల్లో పునరాలోచన చేస్తా. ప్రస్తుతానికి సమావేశం సాఫీగా జరిగింది’’ అంటూ ట్రంప్ వెల్లడించారు. అయితే, పుతిన్ తో భేటీకి ముందు కూడా ట్రంప్ దీని గురించి ప్రస్తావించారు. భారత్ ను ఉద్దేశిస్తూ రష్యా తన చమురు క్లయింట్ ను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతానికి భారత్, చైనా లాంటి దేశాలపై అదనపు టారిఫ్ లు విధించే ఉద్దేశం లేదని అన్నారు.

గత వారం, ట్రంప్ భారత ఎగుమతులపై అదనంగా 25శాతం అదనపు సుంకాన్ని ప్రకటించారు, భారతదేశం రష్యా నుండి భారీగా చమురు దిగుమతులు చేసుకుంటుందని, తద్వారా యుక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడానికి ఆ దేశం సహాయం అందిస్తుందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే భారత దిగుమతులపై సుంకాలు పెంచుతున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, త్వరలో మరింత సుంకాలు పెంచుతామని ఇటీవల హెచ్చరించారు.