Indian Origin Brothers : సంచలన తీర్పు.. భారత సంతతి సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష.. ఎన్ని దారుణాలకు పాల్పడ్డారంటే..
Indian Origin Brothers :
- Dharani Pilli
- Published On : March 15, 2026 / 03:01 PM IST
Indian origin brothers Bhaskar and Arun Savani face 835 year jail term in USA
Indian Origin Brothers : సాధారణంగా మన దేశంలో కోర్టులు విధించే శిక్షల్లో అత్యధిక కాలం జైలు జీవితం గడిపే శిక్షలు ఏవంటే.. మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష (14-20 ఏళ్లు లేదా జీవితాంతం జైల్లోనే), సుదీర్ఘ కాలం శిక్ష (40-43 ఏళ్ల వరకు జైల్లోనే ఉండటం) వంటివి ఉన్నాయి. అయితే ప్రపంచంలోని చాలా దేశాలు కొన్ని తీవ్రమైన నేరాల్లో వేల ఏళ్లకు పైగా శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు ఏకంగా 835 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది ఒక న్యాయస్థానం.
అగ్రరాజ్యం అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన భారత సంతతికి చెందిన సవానీ సోదరులైన భాస్కర్ సవానీ (60), అరుణ్ సవానీ (58)లకు స్థానిక కోర్టు 835 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పన్ను ఎగవేత, హెచ్-1బీ వీసా స్కాం, మనీలాండరింగ్ సహా అనేక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వీరిపై వచ్చాయి. అలాగే వీరు సుమారు 30 మిలియన్ డాలర్ల (రూ. 250 కోట్లకు పైగా) కుంభకోణానికి పాల్పడినట్లు రుజువు కావడంతో.. ఈ ఇద్దరికీ రికార్డ్ స్థాయిలో సుదీర్ఘ జైలు శిక్ష విధించారు.
వీరు హెచ్-1బి (H-1B) వీసా స్కాం, మెడికెడ్ కుంభకోణం, పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్ వంటి నేరాలతో పాటు.. మరో దారుణానికి పాల్పడ్డారు. FDA అనుమతి లేని, “మనుషులపై వాడకూడదు” అని రాసి ఉన్న ప్రోటోటైప్ డెంటల్ ఇంప్లాంట్స్‌ను.. వీరి వద్దకు చికిత్స కోసం వచ్చిన రోగులకు తెలియకుండానే వారి శరీరాల్లో అమర్చారు. వీరిపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువు కావడంతో తాజాగా పెన్సిల్వేనియా కోర్టు ఇద్దరు సోదరులకు కలిపి 835 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భాస్కర్‌కు 420 ఏళ్లు, అరుణ్ సవానీకి 415 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 2023లో వీరిపై ఆరోపణలు నమోదయ్యాయి. 2026, జూలై నుంచి వీరికి విధించిన శిక్ష అమలు కానుంది.
