Auntie Remark : ‘ఆంటీ’ అని పిలిచినందుకు రూ.1.8 లక్షల జరిమానా.. ఇప్పుడు పిలవండ్రా అబ్బాయిలు..!
Auntie Remark : ఓ మహిళను ఆంటీ అని పిలిచినందుకు కోర్టు ఓ వ్యక్తికి రూ.1.8 లక్షల జరిమానా విధించింది.
- Dharani Pilli
- Published On : April 8, 2026 / 09:35 PM IST
Indian origin woman wins harassment case in UK over calling her aunty at work place
- యూకే కోర్టు సంచలన తీర్పు
- భారత సంతతి మహిళను ఆంటీ అన్నందుకు
- రూ.1.8 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు
Auntie Remark : ఆంటీ.. ఒకప్పుడు అత్త, పిన్ని లేదంటే పక్కింటి వాళ్లను మర్యాదగా పిలిచేందుకు వాడే పదం. పల్లెటూళ్లలో అయితే అందరినీ వరసలతో పిలుస్తాం. కానీ సిటీల్లో మాత్రం అందరికీ ఒకే వరస ఆంటీ. ఎంతో ఆప్యాయంగా పిలిచే ఈ పదం ఈ మధ్య కాలంలో బూతుగా మారింది. ఆంటీ అంటే అదో అసభ్యకరమైన తిట్టుగా మారింది. ఈ ఆంటీ పదాన్ని యాంకర్ అనసూయ ఎంత తీవ్రంగా ఖండించిందో.. దీని మీద సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో చూశాం. నేటికీ కూడా అప్పుడప్పుడు ఈ వివాదం తెరమీదకు వస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా కోర్టు ఆంటీ పద వినియోగంపై సంచలన తీర్పు వెల్లడించింది. ఓ మహిళను ఆంటీ అని పిలిచినందుకు కోర్టు రూ.1.8 లక్షల జరిమానా విధించింది.
బ్రిటన్‌లో ఒక భారతీయ మహిళను ‘ఆంటీ’ అని పిలిచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. భారతదేశంలో ఇప్పటికీ చాలా మంది ఈ పదాన్ని గౌరవప్రదమైన పిలుపుగా భావిస్తుండగా.. యూకేలో మాత్రం.. ఆంటీ అనే పిలుపుని.. వయస్సు, లింగ ఆధారిత వేధింపుగా జమ కడతారు. అంతేకాక ఆంటీ అని పిలిచిన వారికి జరిమానా కూడా విధిస్తారు. తాజాగా భారత సంతతికి చెందిన హెల్త్‌కేర్ అసిస్టెంట్ ఇల్డా ఎస్టెవ్స్ (64) ఆంటీ పిలుపు మీద కేసు వేసినందుకు గాను.. పశ్చిమ లండన్‌లోని ఒక NHS ట్రస్ట్ ఆమెకు 1,425 పౌండ్ల (సుమారు రూ. 1.8 లక్షలు) నష్టపరిహారం చెల్లించాలని ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ జడ్జి తీర్పు వెల్లడించారు.
కేసు వివరాలకు వస్తే..
ఘనా దేశానికి చెందిన ఓ నర్సు చార్లెస్ ఒప్పోంగ్ తన సహోద్యోగిని అయిన ఇల్డాను.. వారు పని చేసే ప్రదేశంలో పదే పదే “ఆంటీ” అని పిలిచేవాడు. ఇల్డా అతడిని ఆపేందుకు ప్రయత్నించినా.. అతడు మాత్రం ఆంటీ అనే పిలిచేవాడు. ఇదిలా ఉండగా మూడు సంవత్సరాల క్రితం అనగా.. జూన్ 2023లో, అదే చోట పని చేస్తోన్న 61 ఏళ్ల జార్జ్ అనే వృద్ధ ఉద్యోగికి.. ఇల్డా మంచి భాగస్వామి అవుతుందన్నాడు ఒప్పోంగ్. దీంతో సహనం కోల్పోయిన ఇల్డా.. ఒప్పోంగ్ మీద కోర్టులో కేసు వేసింది. అతడు తనను పదే పదే ఆంటీ అని పిలిచి మనోవేదనకు కారణం అవుతున్నాడని ఆరోపించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా.. ట్రిబ్యునల్ వద్ద ఒప్పోంగ్ ఇల్డా ఆరోపణలను ఖండించాడు. కాకపోతే తాను కేవలం ఒక్కసారి మాత్రమే ఆమెను ఆంటీ అని పిలిచినట్లు అంగీకరించాడు. అంతేకాక వారి ఘనా సంస్కృతిలో “ఆంటీ” అనేది పెద్దలను గౌరవంగా పిలిచేందుకు వాడతారని చెప్పుకొచ్చాడు. అయితే ఇల్డాకు మాత్రం తనను ఆంటీ అని పిలవడం నచ్చలేదని.. అలా పిలవడం ఆమెను అవమానించినట్లుగా భావించారని న్యాయమూర్తి ఇలియట్ అంగీకరించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఒప్పోంగ్ ప్రవర్తన మంచిగా లేదు. పని చేసే ప్రదేశంలో ఒప్పోంగ్.. ఇల్డాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమెను వేదనకు గురి చేశాయి. ఇది ఫిర్యాదురాలి వయస్సు, లింగానికి సంబంధించిన వేధింపు కిందకు వస్తుంది. ఇలా వేధించినందుకు గాను ఇల్డాకు రూ.1.8 లక్షలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
