Inland Taipan : ఒక్క కాటుతో 100మందికి పైగా చంపొచ్చు.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇదే
ఈ పాము ఎందుకు అంత ప్రమాదకరం అంటే.. ఇది ఒక్క కాటుతో 110 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుందట. ఆ విషంతో 100 మందికి పైగా వ్యక్తులను, లేదా 2.50 లక్షల ఎలుకలను చంపొచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

Inland Taipan : విషసర్పాలు అనగానే మన భారతీయులకు ఠక్కున గుర్తుచ్చేది నాగుపాము, రక్తపింజరి, కట్లపాము, కింగ్ కోబ్రాలే. అయితే అంతకుమించిన విషసర్పాన్ని చూశారా? కనీసం దాని గురించి విన్నారా? అది ఎంత డేంజర్ అంటే.. దాని ఒక్క కాటుతో 100మందిని చంపొచ్చు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. అలాంటి ప్రమాదకరమైన పాము ఆస్ట్రేలియాలో ఉంది. దాని పేరే ఇన్లాండ్ తైపాన్. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా గుర్తింపు పొందింది.
ఈ పాము ఎందుకు అంత ప్రమాదకరం అంటే.. ఇది ఒక్క కాటుతో 110 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుందట. ఆ విషంతో 100 మందికి పైగా వ్యక్తులను, లేదా 2.50 లక్షల ఎలుకలను చంపొచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
అయితే ఈ ప్రమాదకర పాములు ఆస్ట్రేలియాలో తప్ప మరెక్కడా కనిపించవని, అది కూడా మారుమూల అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తుంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఇక పగటిపూట ఇవి కనిపించడం చాలా తక్కువ అని తెలిపారు. ఇన్లాండ్ తైపాన్ పాము సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుందని.. వీటి కోరలు 3.5 నుంచి 6.2 మిమీ పొడవు ఉంటాయని వివరించారు.
Also Read..Cobra Inside Scooter : బుసలుకొడుతున్న నాగుపామును చేత్తో పట్టుకున్న వ్యక్తి
ఇన్లాండ్ తైపాన్ పాములు రుతువులను అనుసరించి చర్మం రంగును మార్చుకుంటాయన్నారు. చలికాలంలో ముదురు గోధుమ రంగులోనూ, వేసవిలో లేత గోధుమ రంగులోనూ కనిపిస్తాయట. వీటి ఆహారం ఎలుకలు, కోడి పిల్లలు. తెల్లవారుజామున చాలా చురుక్కుగా ఉంటాయని.. లోతైన నేల పగుళ్లు, జంతువుల బొరియల్లో ఉంటాయని పరిశోధకులు తెలిపారు. కాగా.. పాముల్లో 600 విషపూరిత జాతులు ఉండగా.. కేవలం 200 మాత్రమే మనిషిని చంపగలవు లేదా గణనీయంగా హాని చేయగలవన్నారు.