Iran: కేవలం 12 రోజుల్లో ఇరాన్ వద్ద అణ్వాయుధాలు.. సంచలన ప్రకటన చేసిన అమెరికా

అణు కర్మాగారాల్లో చాలా ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను అమర్చడానికి కూడా ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదని నివేదిక పేర్కొంది. అందుకే ఇరాన్ ఏ స్థాయిలో యురేనియం శుద్ధి చేస్తుందో తెలియడం లేదు

Iran Making Nuclear Bomb: మరో రెండు వారాల్లో ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయగలదు. ఈ విషయాన్ని అమెరికా ప్రకటించింది. అమెరికా ఆరోపణల ప్రకారం.. ఇరాన్ వద్ద రెండు వారాల్లో అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి తగినంత మెటీరియల్ ఉంది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తన స్ట్రాటజీ ఫర్ కౌంటర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ రిపోర్ట్ 2023లో ఈ షాకింగ్ విషయాలు చెప్పారు. రికార్డు సమయంలో ఆయుధాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం ఇరాన్‌కు ఉందని అమెరికా నివేదిక పేర్కొంది. అలాగే, ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి వెల్లడించడం లేదు. ఇరాన్ యురేనియం ఉత్పత్తి అణ్వాయుధాలను తయారు చేసే స్థాయికి చేరుకుంటోంది. ఇరాన్ చాలా తక్కువ సమయంలో అణ్వాయుధాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఉత్పత్తి చేయగలదని నివేదిక తెలిపింది.

సరైన సమాచారం దొరకడం లేదు
అణు కర్మాగారాల్లో చాలా ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను అమర్చడానికి కూడా ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదని నివేదిక పేర్కొంది. అందుకే ఇరాన్ ఏ స్థాయిలో యురేనియం శుద్ధి చేస్తుందో తెలియడం లేదు. మే 2023లో ఇరాన్ పర్వతాల కింద అణ్వాయుధాలను తయారు చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించడం గమనార్హం. అసోసియేటెడ్ ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది కార్మికులు ఇరాన్‌లోని జాగ్రోస్ పర్వతాలలో సొరంగాలు తవ్వుతున్నారట. ఈ ప్రదేశం ఇరాన్‌లోని అణ్వాయుధ సైట్ నటాంజ్‌కు చాలా దగ్గరగా ఉందని వాదిస్తున్నారు. ప్రపంచంలోని అణ్వాయుధాలు, అణు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇటీవల ఇరాన్ యురేనియంను 84% సుసంపన్నం చేసిందని తెలిపింది. నిజానికి అణు బాంబును తయారు చేయడానికి 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం.

2 దశాబ్దాలుగా అణుశక్తిగా మారాలనుకుంటున్న ఇరాన్
ఇరాన్ రెండు దశాబ్దాలకు పైగా అణుశక్తిగా మారడానికి ప్రయత్నిస్తోందనే విషయం తెలిసిందే. అయితే, పాశ్చాత్య దేశాలు ఇరాన్‌కు అణుశక్తిని సమకూర్చడం ఇష్టం లేదు. దీంతో 2015 సంవత్సరంలో అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్‌లతో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకూడదు. అయితే 2018లో అమెరికా ఒప్పందం నుంచి బయటకు రావడంతో ఈ ఒప్పందం పనికిరాకుండా పోయింది. ఆ తర్వాత నుంచి యురేనియం శుద్ధి స్థాయిని పెంచడం ప్రారంభించింది ఇరాన్. అలాగే IAEAకి సమాచారం అందించడం కూడా మానేసింది.

ట్రెండింగ్ వార్తలు