Iran vs Israel War : అమెరికాకు గట్టి షాకిచ్చేందుకు సిద్ధమవుతోన్న ఇరాన్.. 10లక్షల మందికిపైగా రంగంలోకి.. 12ఏళ్ల పిల్లలుసైతం..! బిగ్ వార్‌కు ప్లాన్..
Iran vs Israel War : అమెరికా సైన్యం వ్యూహాలను తిప్పికొట్టి.. వారికి గట్టి షాకిచ్చేందుకు ఇరాన్ సర్వసన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా 10లక్షలకుపైగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
- Harishth Thanniru
- Published On : March 27, 2026 / 02:39 PM IST
Iran-Israel War
- అమెరికాను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్న ఇరాన్
- 10లక్షలకుపైగా సైన్యం సిద్ధం
- 12 ఏళ్ల పిల్లలను సైతం యుద్ధంలోకి..
Iran vs Israel War : పశ్చిమాసియా యుద్ధం నిలిపివేత కోసం అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగాల్సిన చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు బలంగా ఉన్నాయని చెబుతున్న అమెరికా.. మరోవైపు పశ్చిమాసియాలో తమ బలగాల మోహరింపును మరింత పెంచుతోంది. ఇరాన్ మాత్రం ట్రంప్ పేర్కొన్నట్లుగా చర్చల్లో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గురువారం ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయగా.. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను కొనసాగించింది. యుద్దం తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా వ్యూహాలను తిప్పికొడుతూ.. గట్టి షాకిచ్చేందుకు ఇరాన్ సన్నద్ధమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే.. పశ్చిమాసియాలో తన సైనిక ఉనికిని విస్తరిస్తున్నారు. అత్యాధునిక ఫైటర్ జెట్లను, విమాన వాహన నౌకలను తరలిస్తున్నారు. అంతేకాక.. పదివేల మంది అమెరికా పదాతి దళ సైనికులను మోహరించడానికి అమెరికా రక్షణ శాఖ సమగ్ర వ్యూహాలను రూపొందిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెలువరించింది. వారితోపాటు పెద్ద మొత్తంలో సాయుధ వాహనాలను కూడా తరలిస్తున్నారు. గగనతలంలోనే ఫ్యూయల్ నింపుకొనే యుద్ధ విమానాలు, గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్‌లు పశ్చిమాసియా వైపునకు తరలుతున్నాయి. ఈ దళాలను ఇరాన్‌తోపాటు పర్షియన్ గల్ఫ్‌లోని కీలకమైన ఖర్గ్ ద్వీపం సమీపంలో మోహరించేందుకు అమెరికా సిద్ధమవుతోంది.
అమెరికా సైన్యం వ్యూహాలను తిప్పికొట్టి.. వారికి గట్టి షాకిచ్చేందుకు ఇరాన్ సైతం సర్వసన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా 10లక్షలకుపైగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వీరిలో 12ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. 12ఏళ్ల పిల్లలు యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీరిని పెట్రోలింగ్, చెక్ పాయింట్ల దగ్గర ఉంచనున్నారు.
మరోవైపు.. బసిజ్ ఫోర్స్ (Basij Force), ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)తో సహా అనేక విభాగాలు తక్షణమే కదనరంగంలోకి వచ్చేవిధంగా దళాలను బలోపేతం చేస్తున్నట్లు ఇరాన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి అమెరికా ఏక్షణమైన ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అమెరికా సైన్యం దాడులను ధీటుగా ఎదుర్కొని, వారికి గట్టి షాకిచ్చేందుకు ఇరాన్ సన్నద్ధమవుతోంది.
