Iran US War: అప్పటివరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. టెహ్రాన్ 5 కండీషన్లు ఇవే..
యుద్ధం విషయంలో ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాలను తిరస్కరించడమే కాదు బదులుగా అమెరికాకే 5 షరతులు విధిస్తూ షాక్ ఇచ్చింది ఇరాన్.
- Naveen
- Published On : March 26, 2026 / 05:48 PM IST
Iran US War: మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ తో చర్చలకు ముందుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని నిలిపివేసేందుకు 15 పాయింట్ల ప్రణాళికను ఆ దేశం ముందు ఉంచారు. అణ్వాస్త్ర తయారీ ప్రణాళికలను టెహ్రాన్ ఉపసంహరించుకోవడం, అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి ఉంచడం వంటి కీలక అంశాలు అందులో ఉన్నాయి.
అయితే ఆ ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. తమపై ఆంక్షలను పూర్తి ఎత్తివేయడం, గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలన్నింటిని మూసివేయడం వంటి తమ డిమాండ్లను అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతామని బదులివ్వడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి షాక్ ఇచ్చినట్లైంది. 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించినప్పటికి చర్చలకు దారులు పూర్తిగా ఏమీ మూసుకుపోలేదని అమెరికా అంటోంది.
యుద్ధం విషయంలో ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాలను తిరస్కరించడమే కాదు బదులుగా అమెరికాకే 5 షరతులు విధిస్తూ షాక్ ఇచ్చింది ఇరాన్. తమ షరతులు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తామని, లేదంటే అప్పటివరకు యుద్ధం ఆగదని తేల్చి చెప్పింది. తాము ప్రతిపాదించిన డిమాండ్లు నెరవేరే వరకు భారీగా దాడులు చేస్తూనే ఉంటామని టెహ్రాన్ హెచ్చరించింది.
Also Read: ట్రంప్ జబర్దస్త్ కామెడీ.. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉండమందట.. కోతల రాయుడు..
అమెరికాకు ఇరాన్ విధించిన 5 షరతులు ఇవే..
1. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, దురాక్రమణలు ఆపాలి
2. భవిష్యత్ లో ఇరాన్ పై ఎలాంటి సైనిక చర్యకు దిగకూడదు
3. యుద్ధం వల్ల కలిగిన నష్టానికి నష్ట పరిహారం చెల్లించాలి
4. పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాల నుంచి వెంటనే యుద్ధాన్ని విరమించుకోవాలి
5. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలి
అలాగే ఇరాన్ పై ఉన్న అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు హెజ్ బొల్లాపై దాడులను ఇజ్రాయెల్ నిలిపివేయాలి అంటూ అగ్రరాజ్యం అమెరికా ముందు షరతులు పెట్టింది ఇరాన్.
