US-Iran War : మళ్లీ మొదలైన యుద్ధం.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. ఆయిల్ ధరలకు రెక్కలు?
US-Iran War : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది.
- Harish Thanniru
- Updated on- July 8, 2026 / 11:59 AM IST
US Iran War Updates USA Launches Strikes On Iran
- పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు
- ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు
- వాణిజ్య రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు
US-Iran War : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. హర్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే ఇరాన్ సైనిక స్థావరాలు, నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది.
యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అంతర్జాతీయ జలమార్గంలో అమాయక పౌరులు ట్రావెల్ చేస్తున్న నౌకలపై దాడులకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించేలా చేయడానికి, శక్తివంతమైన దాడులు ప్రారంభించినట్లు తెలిపింది. ఇరాన్ ప్రదర్శించిన దురాక్రమణ ప్రమాదకరమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
తాజాగా దాడులతో గత నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ప్రమాదంలో పడేసింది. ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించాయని అమెరికా, ఇరాన్ రెండు దేశాలూ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లపై క్షిపణి దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా ఈ దాడులకు దిగింది.
ఇదిలాఉంటే.. ఇరాన్ చమురు విక్రయాలకు అనుమతించే లైసెన్స్ ను అమెరికా రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను ముగించడానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందంలో ఈ లైసెన్స్ ఒక భాగం కావడం గమనార్హం. హర్మూజ్ లో ఇరాన్ చర్యలు ఆమోదయోగ్యం కావని, అందుకే లైసెన్సును రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. అయితే, ఈ చర్యలను ఇరాన్ విదేశాంగశాఖ ఖండించింది. ఇది తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, దీని పర్యవసానాలకు అమెరికా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.
వారం రోజులపాటు ప్రశాంతంగా ఉన్న సమయంలో వరుస దాడులతో మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాజా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ నౌకా రవాణాపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు 3 శాతానికి పైగా పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే చమురు ధరలు పెరగడం ఖాయమనే అంచనాలు ప్రపంచ దేశాల్లో మొదలయ్యాయి.
