Khamenei funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ.. వాళ్లకు ఐఆర్‌జీసీ వార్నింగ్.. మా జోలికి రావొద్దు..
Khamenei funeral : ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టెహ్రాన్ చేరుకుంటున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం.. ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ గైర్హాజరు కావడమే.
- Harish Thanniru
- Updated on- July 3, 2026 / 10:22 PM IST
Khamenei funeral
Khamenei funeral : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు టెహ్రాన్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు, రాజకీయ నాయకులు, మతపెద్దలు, విదేశీ ప్రతినిధులు ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. జూలై 4 నుంచి 9వ తేదీ వరకు టెహ్రాన్, ఖోమ్, మష్హద్ నగరాల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం టెహ్రాన్ లో ఉంచగా.. చివరగా ఆయన స్వస్థలమైన మష్హద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత్ బృందం టెహ్రాన్ చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అత్ -హస్సైన్ లు భారత్ తరపున ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపింది. వీరితోపాటు భారత్‌కు చెందిన పలువురు మత పెద్దలతో కూడిన బృందం కూడా ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టెహ్రాన్ చేరుకుంటున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం.. ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గైర్హాజరు కావడమే. భద్రతాపరమైన తీవ్రమైన ముప్పు ఉండటంతో మొజ్తబా ఖమేనీ బహిరంగంగా అంత్యక్రియలకు హాజరుకాకూడదని ఇరాన్ భద్రతా సంస్థలు సూచించినట్లు భారతదేశంలో ఇరాన్ సుప్రీంలీడర్ ప్రతినిధి అయతొల్లా హకీమ్ ఎలాహీ తెలిపారు. అంత్యక్రియల్లో పాల్గొనాలనే ఆసక్తి మొజ్తబాకు ఉన్నప్పటికీ, ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు.. ఐదు రోజులపాటు కొనసాగే ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో లక్షలాది మంది అభిమానులు, విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా ముప్పుపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) కీలక ప్రకటన చేసింది. రానున్న రోజుల్లో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఏమైనా ప్రయత్నాలు జరిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించింది. మునుపెన్నడూ చూడని విధంగా తమ ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి సోషల్ మీడియాలో చేసిన వాఖ్యల నేపథ్యంలో ఐఆర్‌జీసీ ఇలా స్పందించింది.
