Ivanka Trump : ఇవాంకా ట్రంప్‌ని లేపేయడానికి ప్లాన్.. పట్టుబడిన ఇరాన్ టెర్రరిస్ట్? అతని బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
Ivanka Trump : ఇవాంకా ట్రంప్, అతని భర్త జారెడ్ కుష్నర్‌లకు 24మిలియన్ డాలర్ల విలువైన ఇల్లు ఉన్న ప్లోరిడా ప్రాంతాన్ని చూపిస్తూ ఎక్స్ ఖాతాలో అల్ సౌదీ ఒక చిత్రాన్ని పోస్టు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ పోస్టులో మీ రాజభవనాలు గానీ, సీక్రెట్ సర్వీస్ గానీ మిమ్మల్ని రక్షించవని అమెరికన్లను హెచ్చరిస్తూ అరబిక్‌లో ఒక సందేశం ఉంది.
- Harish Thanniru
- Updated on- May 23, 2026 / 11:57 AM IST
Ivanka Trump
Ivanka Trump : అమెరికా సైన్యం ఇటీవల జరిపిన దాడుల్లో ఇరాన్ అగ్రనేతలు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్లు, ఐఆర్‌జీసీ శిక్షణ పొందిన ఓ వ్యక్తి ఆమె హత్యకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, అంతేకాకుండా.. ఆమె భర్త జారెడ్ కుష్నర్ తో కలిసి నివసించిన ప్లోరిడా నివాసంకు చెందిన బ్లూప్రింట్ ను కూడా ఆ వ్యక్తి కలిగి ఉన్నాడని అధికారుల దర్యాప్తులో తేలినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
2020లో ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇవాంకా ట్రంప్ ను హతమార్చేందుకు ఈ పథకం రచన చేశాడని, అతడు ప్లాన్ అమలు చేసేలోపే అరెస్టు అయ్యాడని న్యూయార్క్ పోస్టు నివేదిక పేర్కొంది. ఇవాంకా హత్యకు కుట్ర చేసిన వ్యక్తి 32 ఏళ్ల మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సాదీ. కొంతకాలం క్రితం తుర్కియేలో అతను అరెస్టు అయ్యాడు. అక్కడి నుంచి అతడ్ని అమెరికాకు తరలించారు. బాఖర్ సాద్ ని విచారించిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలను గుర్తించారు. ఇవాంకా ట్రంప్‌ను చంపుతానని అతను శపథం చేశాడని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
ఖాసీం సులేమాని హత్య తర్వాత ప్రతీకార కుట్ర..
నివేదిక ప్రకారం.. 2020లో అమెరికా సైన్యం డ్రోన్ దాడిలో బాగ్దాద్‌లో సులేమానీని హతమార్చింది. సులేమానీ హత్యకు ప్రతీకారంగా మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సౌదీ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. వాషింగ్టన్‌లోని ఇరానీ రాయబార కార్యాలయంలో మాజీ డిప్యూటీ మిలిటరీ అటాచ్ అయిన ఎంటిఫాద్ ఖాన్బార్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఆల్ సౌది ప్రతీకారం తీర్చుకోవడం గురించి బహిరంగంగా మాట్లాడారని పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చాయి. ఖాసీం సులేమాని హత్య తరువాత ట్రంప్ ఇంటినిసైతం అలాగే కూల్చేయాలని, తద్వారా ఇవాంకాను హతమార్చాలని అతను ప్రజలందరితో చెబుతూ తిరిగాడని ఖన్బార్ చెప్పారు. ప్లోరిడాలోని ఇవాంకా ట్రంప్ ఇంటికి సంబంధించిన ప్లాన్ నిందితుడి వద్ద ఉందని కూడా అతను చెప్పినట్లు తెలిసింది.
సోషల్ మీడియాలో బెదిరింపులు..
ఇవాంకా ట్రంప్, అతని భర్త జారెడ్ కుష్నర్‌లకు 24మిలియన్ డాలర్ల విలువైన ఇల్లు ఉన్న ప్లోరిడా ప్రాంతాన్ని చూపిస్తూ ఎక్స్ ఖాతాలో అల్ సౌదీ ఒక చిత్రాన్ని పోస్టు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ పోస్టులో మీ రాజభవనాలు గానీ, సీక్రెట్ సర్వీస్ గానీ మిమ్మల్ని రక్షించవని అమెరికన్లను హెచ్చరిస్తూ అరబిక్‌లో ఒక సందేశం ఉంది.
నిందితుడు అల్ సాదీ ఇరాక్-ఇరాన్ ఉగ్రవాద వర్గాలలో ఒక కీలక వ్యక్తి అని, కతైబ్ హిజ్బుల్లా, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ రెండింటితోనూ సంబంధాలున్న వ్యక్తి అని అమెరికా అధికారులు చెబుతున్నారు. యూరప్, యునైటెడ్ స్టేట్స్ అంతటా జరిగిన 18 దాడులు, దాడి యత్నాలకు సంబంధించి అల్-సాదిపై అమెరికా న్యాయ శాఖ అభియోగాలు మోపింది.
ఖాన్బార్ ప్రకారం.. 2006లో తన తండ్రి, ఇరాన్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ కజెమీ మరణం తరువాత అల్ సౌదీకి సులేమానీతో సన్నిహిత సంబంధం ఉండేది. అతన్ని ఆల్ సౌదీ తండ్రిలా భావించేవాడు. ఇరాన్ సైన్యానికి చెందిన ఐఆర్జీసీలో శిక్షణకోసం టెహ్రాన్ కు వెళ్లడానికి ముందు అతను తన తల్లితో కలిసి బాగ్దాద్ లో పెరిగాడని సమాచారం. తరువాత ఆల్ సౌదీ మతపరమైన పర్యటనలలో ప్రత్యేకత కలిగిన ఒక ట్రావెల్ ఏజెన్సీని నడిపాడని, అది అతనికి అంతర్జాతీయంగా ప్రయాణించడానికి, ఉగ్రవాద సెల్‌లతో సంబంధాలు ఏర్పడటానికి వీలు కల్పించిందని ఖాన్బార్ చెప్పారు.
మే 15న టర్కీలో అతన్ని అరెస్టు చేసినప్పుడు, ఇరాక్ ప్రధానమంత్రి ఆమోదంతో సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పౌరసేవకులకు మాత్రమే జారీ చేసే ఇరాకీ సర్వీస్ పాస్ట్‌పోర్టు అతని వద్ద ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సులేమానీ మరణం తర్వాత 2020లో చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో “అమెరికా శత్రువు ఓడిపోయే వరకు” తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని అల్-సాదీ ప్రకటించినట్లు సమాచారం. అయితే, అతను ఆ తర్వాత ఆన్‌లైన్‌లోకి తిరిగి వచ్చి, సులేమానీని, అమెరికా దాడులలో మరణించిన ఇతర ఇరాన్ సైనిక ప్రముఖులను ప్రశంసిస్తూ సందేశాలు పోస్ట్ చేయడం కొనసాగించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆల్ -సౌదిని బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ జైలులో ప్రత్యేక గదిలో ఉంచారు.
