USA- Iran peace talks : అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం.. జేడీ వాన్స్ సంచలన ప్రకటన.. ఇరాన్ ఏమన్నదంటే?
USA- Iran peace talks : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా - ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి.
- Harish Thanniru
- Published on- April 12, 2026 / 01:35 PM IST
USA- Iran peace talks
- అమెరికా – ఇరాన్ చర్చలు విఫలం
- ఇరాన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీ వాన్స్
- చర్చలు విఫలం తరువాత ఇరాన్ కీలక కామెంట్స్
USA- Iran peace talks : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. దాదాపు 21గంటల పాటు చర్చలు జరిగాయి. అయితే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం అర్ధంతరంగా చర్చలను ముగించి వెనక్కి వెళ్లిపోయింది.
చర్చల ముగింపు అనంతరం జేడీ వాన్స్ ఇస్లామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాదాపు 21గంటల పాటు నిరంతరాయంగా ఇరాన్‌తో తాము చర్చలు జరిపామని, అనేక కీలక విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఒప్పందానికి అనుకూలంగా తాము షరతులు విధించామని, కానీ, వాటిని ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్ పేర్కొన్నారు. చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని, ఇది అమెరికా కంటే ఇరాన్ కే దురదృష్టకర వార్త అని వాన్స్ చెప్పారు. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే తాము.. అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నట్లు వెల్లడించారు.
ఇదిలాఉంటే.. చర్చల్లో ప్రధానంగా.. హార్మూజ్ జలసంధిని తెరవాలన్నది అమెరికా డిమాండ్‌గా తెలిసింది. అలాగే, యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపాలని ఇరాన్‌కు అమెరికా కోరింది. ఇందుకు తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. విదేశాల్లోని తమ ఆస్తులపై ఉన్న ఫ్రీజ్‌ను తొలగించాలని ఇరాన్ కోరినట్టు తెలిసింది. ఇదే విషయంపై వాన్స్ మాట్లాడుతూ.. గతంలో వారి వద్ద ఉన్న సుసంపన్నత సౌకర్యాలు ధ్వంసం చేయబడ్డాయి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఇరానీయులు అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకూడదనే ప్రాథమిక సంకల్పం. కేవలం ఇప్పుడే కాదు, లేదా రెండేళ్ల తర్వాతే కాదు, దీర్ఘకాలం పాటు. చర్చల్లో అది మాకు ఇప్పుడు కనిపించలేదు. భవిష్యత్తులో కనిపిస్తుందని మేము ఆశిస్తున్నామని వాన్స్ చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన తరువాత ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని వెల్లడించింది. అమెరికా మితిమీరిన డిమాండ్ల వల్లే ఒప్పందం కుదరలేదని.. చర్చల అనంతరం వివాదాస్పద అంశాలు లేవనెత్తారని ఇరాన్ చెప్పుకొచ్చింది. హర్మూజ్ జలసంధి, అణు హక్కుల వంటి వివాదాస్పద అంశాలు ప్రస్తావించారని, ఏమీ తేలకుండానే యూఎస్‌తో చర్చలు ముగిశాయని ఇరాన్ ప్రకటించింది.
