ఎంప్లాయ్‌తో రిలేషన్ షిప్: సీఈవోను తప్పించిన మెక్ డొనాల్డ్ సంస్థ

కాఫీ డే సిద్ధార్థ్ ఆత్మహత్య తర్వాత మరో ఫుడ్ సంబంధింత సంస్థ వార్తల్లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వయస్సుల వారిని మెప్పించి ఆదరణ దక్కించుకున్న మెక్ డొనాల్డ్ సీఈఓను తొలగిస్తూ సంచలన ప్రకటన చేసింది. కంపెనీ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకుగానూ ఈ నిర్ణయం తీసుకుంది. సీఈవోగా పనిచేస్తున్న ఈస్టర్ బ్రూక్ ఓ ఉద్యోగితో రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉండటమే దీనికి కారణం. 

కొద్ది రోజులుగా వస్తున్న ఈ ఆరోపణలు నిజమని తేలడంతో అతను విధుల నుంచి తప్పుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. సహోద్యోగినితో రిలేషన్ షిప్ లో ఉన్నారని లేఖ ద్వారా కొందరు ఉద్యోగులు మేనేజ్‌మెంట్‌కు కంప్లైంట్ చేశారు. దానిపై విచారణ జరిపిన సంస్థ ఉద్యోగుల ముందు ప్రతిపాదన ఉంచింది. ఉద్యోగులంతా సీఈవోను తప్పించడమే సబబు అంటూ ఓట్ వేశారు. 

దీనికి స్వయంగా తానే కంపెనీ నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నట్లు ఈస్టర్ బ్రూక్ చెప్పారు. ‘కంపెనీ విలువలను అనుసరించి బోర్డు నిర్ణయించిన ప్రకారం తొలగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని లేఖలో స్టీవ్‌ రాసుకొచ్చారు. స్టీవ్‌పై వచ్చిన ఆరోపణలకు మెక్ డొనాల్డ్‌ బోర్డు విచారణ జరిపి తొలగించాలని నిర్ణయించారు. నూతన సీఈఓగా అమెరికా మెక్‌డొనాల్డ్‌ అధ్యక్షుడిగా పనిచేసిన క్రిస్‌ కెంపీజీజిన్‌స్కీ పేరును ప్రతిపాదించారు బోర్డు సభ్యులు.