Bill Gates
Bill Gates : ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై బిల్‌గేట్స్ మాజీ సతీమణి మిలిండా గేట్స్ సైతం స్పందించడంతో చర్చ తీవ్రతరమైంది. మిలిండా, బిల్ గేట్స్ 2021లో విడాకులు తీసుకున్నారు. అయితే, తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్ సంబంధాలు కూడా తమ వైవాహిక జీవితంలో విబేధాలకు ఒక కారణమనే రీతిలో ఆమె స్పందించారు. బిల్‌గేట్స్‌కు ఎప్‌స్టీన్‌తో ఉన్న పరిచయం తనకు అసౌకర్యం కలిగించిందని ఆమె చెప్పారు. దీంతో కొద్దిరోజులుగా ఎప్‌స్టీన్ వ్యవహారంలో బిల్‌గేట్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా.. బిల్‌గేట్స్ స్పందించారు.
Also Read : Gold and Silver Rates Today : ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..
ఆస్ట్రేలియా 9న్యూస్ చానెల్ చీఫ్ పొలిటికల్ ఎడిటర్ చార్లెస్ క్రౌచర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారంపై స్పందించారు. ‘ఎప్‌స్టీన్ కోసం కేటాయించిన ప్రతీ క్షణానికి ఇప్పుడు నేను చింతిస్తున్నాను. అందుకు పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరుతున్నాను. అయితే, ఆ ఈ-మెయిల్‌లో ఉన్నది నిజం కాదు. అప్పుడు అతడి ఆలోచన ఏంటో నాకు తెలియదు. ఏదో ఒక రూపంలో అతడు నన్ను టార్గెట్ చేయాలని ప్రయత్నించాడా..? అని వ్యాఖ్యలు చేశారు.
2011లో తొలిసారి ఎప్‌స్టీన్‌ను కలిశా. అప్పటి నుంచి మూడేళ్లపాటు కొన్ని విందు కార్యక్రమాల్లో మేం పాల్గొన్నాం. అంతే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనికుల నుంచి గ్లోబల్ హెల్త్ పేరిట విరాళాలు తెచ్చిపెడతానని అతను నాతో అన్నాడు. అది వృథా ప్రయత్నమని నేను అతనికి చెప్పాను. అతని దీవికి ఏనాడూ నేను వెళ్లింది లేదు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడిందీ లేదు. అతడితో గడిపిన ప్రతీ నిమిషం పట్ల నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. అందుకు అందరినీ క్షమాపణలు కోరుతున్నా అని బిల్‌గేట్స్ వ్యాఖ్యానించారు.
ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంకు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల తాలూకా మెయిల్స్, మరికొన్ని ఫొటోలు వెలుగులోకి రావడాన్ని బిల్ గేట్స్ తోసిపుచ్చారు. ఎప్‌స్టీన్ రాసిన డ్రాప్ట్ ఈ-మెయిల్స్ లో ఉన్న ఆరోపణలు అసత్యమని, ఆ ఈ-మెయిల్ ఎప్పుడూ తాను పంపలేదని తెలిపాడు. మరోవైపు.. బిల్‌గేట్స్ వ్యక్తిగత ప్రతినిధి సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు. గేట్స్ తనతో స్నేహం కొనసాగించలేదన్న కోపంతోనే ఎప్‌స్టీన్ అలా డ్రాప్ట్ మెయిల్స్‌ను సృష్టించి ఉంటాడని తెలిపారు.
అమెరికా న్యాయ శాఖ తాజాగా రిలీజ్ చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ లో కొన్ని డ్రాప్ట్ ఈ-మెయిల్స్ లో బిల్ గేట్స్ పేరు ప్రస్తావించబడింది. అందులో గేట్స్ పై అనైతిక సంబంధాలు, రష్యన్ యువతులతో గడిపినందుకు సుఖ వ్యాధి సోకిందనే ఆరోపణలు వెలుగు చూశాయి. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది.