Donald Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. అప్పటివరకు దాడులు ఆగవు..!

ఇరాన్ పై యుద్ధంలో అమెరికాతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి అంటూ వారిపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు ట్రంప్.

  • Published On : April 1, 2026 / 09:29 PM IST

 

Donald Trump: ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పులు విరమణకు ఇరాన్ సిద్ధంగా ఉందన్నారు. ఇరాన్ అధ్యక్షుడు సీజ్ ఫైర్ కోరారని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. అయితే దీనికి ట్రంప్ ఒక కండీషన్ పెట్టారు. ఇరాన్ తో చర్చలకు ముందు హర్మూజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. హర్మూజ్ జలసంధి తెరిచి నౌకలు ప్రయాణం సాగించిన తర్వాతే చర్చల ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తుందన్నారు. హర్మూజ్ జలసంధిని తెరిచే వరకు ఇరాన్ పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు.

అటు ఇరాన్ పై యుద్ధంలో అమెరికాతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి అంటూ వారిపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు ట్రంప్. మీ కోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏమాత్రం సాయం చేయబోదన్నారు. మీకు మాకు సాయానికి రాలేదు కదా, చమురు కావాలంటే మీకు రెండే మార్గాలు ఉన్నాయన్నారు. మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం, లేదంటే సాహసం చేసి హర్మూజ్ దగ్గర ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం.. ప్రస్తుతం మీ ముందున్న రెండు మార్గాలు ఇవే.. అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చారు ట్రంప్.

కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా ఉంది అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ మాటల్లో నిజం లేదంది. నిరాధారమైన వ్యాఖ్యలు చేశారంటూ ట్రంప్ పై మండిపడింది. తాము అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని తేల్చి చెప్పింది ఇరాన్.

Also Read: డిజిటల్ పేమెంట్లపై RBI కొత్త రూల్స్.. ఇక OTP ఒక్కటే సరిపోదు.. 2FA మస్ట్.. ఫుల్ డిటెయిల్స్..!