Alejandra Marisa Rodríguez : చరిత్రలో తొలిసారి.. అందాల పోటీలో విజేతగా నిలిచిన 60 ఏళ్ల బామ్మ.. మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ కిరీటం సొంతం
అందాల పోటీల్లలో విజేతగా నిలవాలంటే 16 నుంచి 28 మధ్య వయసే ఉండాల్సిన అవసరం లేదని నిరూపించింది ఓ మహిళ.
- Thota Vamshi Kumar
- Updated on- April 27, 2024 / 10:58 AM IST
Miss Universe Buenos Aires Alejandra Rodríguez
అందాల పోటీల్లో విజేతగా నిలవాలంటే 16 నుంచి 28 మధ్య వయసే ఉండాల్సిన అవసరం లేదని నిరూపించింది ఓ మహిళ. 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ రాజధాని లా ప్లాటాకు చెందిన అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 టైటిల్ ను గెలుచుకుంది. ఆమె చిరునవ్వు, మనోహరమైన ప్రవర్తన న్యాయనిర్ణేతల, ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
లా ప్లాటా ప్రాంతానికి చెందిన ఆమె అందాల రాణి మాత్రమే కాదు ఓ సీనియర్ న్యాయవాది, పాత్రికేయురాలు కూడా. కాగా.. ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోటీల్లో విజేతగా నిలిచిన అనంతరం అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ‘అందాల పోటీలలో ఈ కొత్త నమూనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నేను ఎంతో థ్రిల్‌గా ఫీలైయ్యాను. ఎందుకంటే మహిళల శారీరక సౌందర్యం మాత్రమే కాదు.. మరొక విలువలతో కూడిన కొత్త వేదికను మేము ప్రారంభిస్తున్నాము .’అని చెప్పింది.
కాగా.. ఆమె బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ తరుపున 2024 మే నెలలో జరగనున్న మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీల్లో పాల్గొననుంది. అక్కడ విజేతగా నిలిస్తే.. మిస్ యూనివర్స్ వరల్డ్‌లో ప్రపంచ వేదికపై అర్జెంటీనా జెండాను రోడ్రిగ్జ్ ఎగురవేస్తారు. ఈ పోటీలు మెక్సీకోలో 2024 సెప్టెంబర్ 28న జరగనున్నాయి.
కాగా.. మిస్ యూనివర్స్ పోటీల్లో గతంలో పాల్గొనాలంటే వయోపరిమితి ఉండేది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య గల అవివాహితులైన, సంతానం లేని వారు మాత్రమే పాల్గొనాల్సి ఉండేది. అయితే.. దీన్ని సవరించారు. 18 నిండిన ఏ మహిళా అయిన పోటీలో పాల్గొనేందుకు అర్హులు.
