Gold Donation (Representative Image (Image Credit To Original Source))
Gold Donation: ఈరోజుల్లో అంతా మనీ చుట్టూ తిరుగుతున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతున్నారు. ఎంత సంపాదించినా తృప్తి చెందక మరింత సంపాదించాలని ఆరాటపడుతున్నారు. కొందరు కాసుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. అక్రమాలు, మోసాలు చేసైనా సరే డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. అలాంటి ఈ రోజుల్లోనూ కొందరు మనుషులు తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. సమాజం కోసం తమ సంపాదనను విరాళంగా ఇచ్చేస్తున్నారు. 10 మందికి ఉపయోగపడే పనుల కోసం తాము సంపాదించిన డబ్బుని వినియోగిస్తున్నారు. జపాన్ లో అలాంటి ఘటన ఒకటి జరిగింది. సమాజం కోసం ఓ వ్యక్తి ఏకంగా 21 కిలోల బంగారం విరాళంగా ఇచ్చేశారు.
జపాన్ లోని ఒసాకాలో ఈ ఘటన జరిగింది. ఒసాకా నగర అభివృద్ధి కోసం గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చేశారు. సుమారు 30 కోట్ల విలువైన ఈ గోల్డ్ ను నగరంలోని పాతబడిన వాటర్ సిస్టమ్ ను బాగు చేసేందుకు వాడాలని ఆయన కోరారు. 40ఏళ్ల నాటి డ్రైనేజీ, తాగునీటి పైపుల వల్ల వస్తున్న లీకేజీ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ డొనేషన్ ఇచ్చారాయన. ఆయన ఇలా విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి కాదట. గతంలోనూ 3 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
21 కిలోల బంగారం విరాళంగా ఇచ్చినప్పటికీ.. ఆయన వివరాలను బయటకు రానివ్వకపోవడం విశేషం. ఆయనది గొప్ప మనసు అని అంతా ప్రశంసిస్తున్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తులు ఉన్న ఈరోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు అని అంటున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం మరింత మంది ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.
ఒసాకాలో దాదాపు 30 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఒసాకా.. జపాన్‌లోని కాన్సాయ్ ప్రాంతంలో ఉన్న ఒక వాణిజ్య కేంద్రం. దేశంలోని మూడవ అతిపెద్ద నగరం. అనేక జపాన్ నగరాల మాదిరిగానే ఒసాకాలోని నీరు, మురుగునీటి పైపులు పాతబడుతున్నాయి. ఇది భద్రత పట్ల ఆందోళన పెంచుతోంది.
2024 ఆర్థిక సంవత్సరంలో ఒసాకాలో రహదారుల కింద 90కి పైగా నీటి పైపు లీకేజీలు సంభవించాయని నగర వాటర్‌వర్క్స్ బ్యూరో తెలిపింది. పాతబడిన నీటి పైపుల సమస్యను పరిష్కరించడానికి భారీ పెట్టుబడి అవసరం అని, ఈ సమయంలో ఈ భారీ విరాళం చేసిన వ్యక్తిని ప్రశంసించడం తప్ప మరేమీ చేయలేను అని ఒసాకా మేయర్ యోకోయామా అన్నారు.
21 కిలోల బంగారు కడ్డీలను గత నవంబర్‌లో దాత విరాళంగా ఇచ్చారని ఒసాకా మేయర్ మీడియాకు తెలిపారు. దాదాపు 30లక్షల మందికి నివాసంగా ఉన్న ఒసాకా.. జపాన్‌లోని కాన్సాయ్ ప్రాంతంలో, దేశంలోని మూడవ అతిపెద్ద నగరంలో ఉన్న వాణిజ్య కేంద్రం.