Nepal Floods : మరో జలప్రళయం దూసుకొస్తోంది.. నేపాల్‌ను హెచ్చరించిన చైనా..

Nepal Floods : నేపాల్ - చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటికే తీవ్ర నష్టం జరిగింది. ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధికారులు షాకింగ్ విషయం చెప్పారు.

Nepal Floods

Nepal Floods : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోగా.. వందలాది మంది జలసమాధి అయ్యారు. నేపాల్‌లోని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన ప్రకారం.. ఈ ఆకస్మిక వరదల కారణంగా 826మంది ఆచూకీ గల్లంతయిందని పేర్కొంది. వీరిలో 579 మంది పర్యాటకులు ఉండగా.. వారిలో 300 మంది వరకు భారతీయులు ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఈ పెనువిషాదంలో మృతుల సంఖ్య 175కు చేరింది. వీరి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

నేపాల్ – చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటికే తీవ్ర నష్టం జరిగింది. ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధికారులు షాకింగ్ విషయం చెప్పారు. సహాయక చర్యలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. విపత్తు ప్రాంతానికి ఈశాన్యంగా చోచెన్ ఖోలా, పురెపు సాంగ్పో నదుల సంగమం వద్ద ఉన్న బారియర్ లేక్ (అడ్డంకి సరస్సు) పొంగిపొర్లుతోందని వెల్లడించారు. మచ్చే 72గంటల్లో దీంతో దిగువ ప్రాంతాల్లో మరిన్ని వరదలు సంభవించే అవకాశం ఉందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు చేసింది.

నేపాల్‌లోని చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్సో నదుల సంగమం సమీపంలో ఉన్న బారియర్ లేక్ ఏర్పడింది. కొండచరియలు విరిగిపడటంతో నదీ ప్రవాహానికి అడ్డుగా మట్టి, రాళ్లు పేరుకుపోయి ఈ సరస్సు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. చైనా అధికారులు గుర్తించిన బారియర్ లేక్‌లో ప్రస్తుతం సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ సరస్సు నుంచి నీరు పొంగిపొర్లుతుండగా.. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు అందులోకి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ పేర్కొంది. దీంతో దిగువ ప్రాంతాల్లో మరిన్ని వరదలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ కొత్త ప్రమాదం నేపథ్యంలో చైనా జల వనరుల మంత్రిత్వ శాఖ సరస్సు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నీటి మట్టం, ప్రవాహంపై అంచనాలు వేస్తోంది. ఇప్పటికే ప్రమాద ప్రాంతాల్లోని టిబెట్ వైపు గ్రామాలను ఖాళీ చేయించారు. మరోవైపు.. నేపాల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతుండగా.. వందలాది మంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. నేపాల్ సైన్యం రక్షణ చర్యల్లో పాల్గొంటూ హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

బారియల్ లేక్ పరిస్థితి తీవ్రత దృష్ట్యా చైనా బీజింగ్, చెంగ్దూ ప్రాంతాల నుంచి ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపింది. చైనా, నేపాల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని బారియర్ లేక్ నుంచి మరింత వరద వస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు.