Netanyahu Pagers : చేతిలో ‘పేజర్’.. మెసేజ్ క్లియర్.. నెతన్యాహు అసలు స్ట్రాటజీ ఏంటి ? ఆ పేరు వింటే వణుకెందుకు..
Netanyahu Pagers : ఐక్యరాజ్యసమితి వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్ అవుతున్నాయి. UN సాధారణ సభలో తన చేతిలో ఓ పేజర్‌ను పైకి చూపిస్తూ నెతన్యాహు చేసిన హెచ్చరికలు ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేశాయి.
- Harish Thanniru
- Updated on- September 26, 2026 / 09:21 AM IST
Netanyahu
Netanyahu Pagers : పశ్చిమాసియా ఇప్పుడు మండుతోందంటే.. ఆ జ్వాల మొదలైంది ఇజ్రాయెల్ దగ్గరే ! అక్టోబర్ 7 ఘటన తర్వాత హమాస్‌ను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత మిడిలీస్ట్ స్వరూపమే మారిపోయింది. హమాస్‌కు మద్దతుగా హిజ్‌బొల్లా రావడం.. ఆ రెండు సంస్థలకు సపోర్ట్ చేస్తోందని ఇరాన్‌ను ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం.. కారణాలు ఏవైనా ఆ తర్వాత పరిణామాలతో అమెరికా ఎంట్రీ ఇవ్వడంలాంటి.. పశ్చిమాసియా రగిలిపోతోంది. అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో.. ఎప్పుడు ఆగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్ అవుతున్నాయ్. UN సాధారణ సభలో తన చేతిలో ఓ పేజర్‌ను పైకి చూపిస్తూ నెతన్యాహు చేసిన హెచ్చరికలు ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేశాయ్. గతంలో లెబనాన్‌లో హిజ్‌బొల్లా దళాలపై తాము నిర్వహించిన సంచలన పేజర్ ఆపరేషన్‌ను గుర్తుచేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ వర్గాల్లో పెను ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయ్..
ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాలపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. నెతన్యాహు వ్యాఖ్యలతో హైడ్రామా చోటుచేసుకుంది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ వైఖరిని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేయగా.. అంతర్జాతీయ మీడియా ఈ దృశ్యాలను ప్రముఖంగా హైలైట్ చేసింది. సభలో ఒకవైపు ప్రతినిధులు బయటకు వెళ్తుండగా.. మరికొందరు చప్పట్లు కొడుతూ హిబ్రూ భాషలోఅమ్ ఇజ్రాయేల్ చాయ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన నెతన్యాహు.. సభ నుంచి వెళ్తున్న వారిని ఉద్దేశించి ఇంకా నైతికంగా పిరికివాళ్లు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగం మొత్తం.. ఇరాన్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సభ నుంచి వెళ్లిన ప్రతినిధులు ఇరాన్‌పై దాడి చేయడాన్ని సమర్ధిస్తూనే.. ఇజ్రాయెల్‌కు ధన్యవాదాలు కూడా చెప్పారని.. ఇంతకుమించి దిగ్భ్రాంతికరమైన ద్వంద్వ ప్రమాణాలు మరొకటి ఉండవని మండిపడ్డారు.
వాకౌట్ జరుగుతున్న సమయంలో ఇరాన్ ప్రతినిధులు.. తమ ఖాళీ కుర్చీలలో ఒక నిరసన సందేశాన్ని ఉంచారు. ప్రసంగం సాగుతున్నంత సేపు సభకు దూరంగా ఉన్న ఆ నేతలు.. ఇరాన్ ప్రముఖ నాయుకుడు, ఖుద్స్ దళాల మాజీ కమాండర్ సులేమానీ ఫొటోను అక్కడే వదిలి వెళ్లారు. 2020 జనవరిలో అమెరికా డ్రోన్ దాడిలో సులేమానీ చనిపోయాడు. ఇక అటు ఐక్యరాజ్యసమితి సభలో ప్రసంగిస్తూ తన చేతిలోని పేజర్‌ను పైకెత్తిన నెతన్యాహు.. తాము హిజ్‌బొల్లాను తీవ్రంగా దెబ్బతీశామని చెప్పారు. ఆ బీపర్ల విషయం గుర్తుంది కదా.. వీటిని ఎప్పటికీ గుర్తుంచుకోండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హిజ్‌బొల్లా నాయకులు చనిపోయారని.. ఇజ్రాయెల్ పౌరులనే లక్ష్యంగా చేసుకున్న లక్షా 50వేల బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ల భారీ ఆయుధ సంపత్తి అంతా నాశనం అయిందని.. నెతన్యాహు సభలో స్పష్టం చేశారు. ఇక అటు ఇజ్రాయెల్‌ను విమర్శిస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్‌పై మండిపడిన నెతన్యాహు.. ఆ రెండు దేశాలు తమపై వలసవాద ఆరోపణలు చేస్తున్నాయని, దేవుడి దయతో ఆ పదాన్ని కనిపెట్టింది వాళ్లే అంటూ సెటైర్లు సంధించారు.
హమాస్, హిజ్‌బొల్లా, హౌతీలు, ఇరాన్.. ఇరాక్, సిరియాలోని మిలీషియా గ్రూప్‌లు, వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా గ్రూప్‌లు.. ఇలా గత మూడేళ్లుగా ఏడు వైపుల నుంచి.. ఇజ్రాయెల్ యుద్ధం ఎదుర్కొంటోందని నెతన్యాహుూ అన్నారు. ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్‌ను అంతం చేయాలని ప్రయత్నించాయని.. అయితే తాము వాటికి తీవ్ర నష్టం కలిగించామని అన్నారు. ఐతే హమాస్, హిజ్‌బొల్లా, ఇరాన్ న్యూక్లియర్ సౌకర్యాలపై దాడులను విజయాలుగా చూపించే ప్రయత్నం నెతన్యాహు మాటల్లో కనిపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇక అటు పేజర్‌ను చూపించడం వెనక కూడా పక్కా స్ట్రాటజీ ఉందనేది మరికొందరి వాదన. సక్సెస్‌స్టోరీకి సింబల్‌గా.. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, మిలటరీ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు చూపించే ప్రయత్నం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఓవరాల్‌గా ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో నెతన్యాహు పేజర్ చూపించడం అనేది.. ప్రధానంగా దేశీయ రాజకీయ వ్యూహం, సైనిక విజయాలను హైలైట్ చేయడం, బలమైన నాయకుడిగా చిత్రీకరించుకోవడంగా కనిపించింది.
వచ్చే నెలల్లో ఇజ్రాయెల్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగబోతున్నాయ్. వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా నెతన్యాహు ఇలాంటి కామెంట్లు చేశారా అనే చర్చ జరుగుతోంది. ఐతే పేజర్ చూపించి ఆయన చెప్పిన మాటలు.. తాను మాత్రమే దేశాన్ని కాపాడగలను అనే సందేశాన్ని ఇచ్చినట్లు అయింది. ఇక అటు ఏడు వైపులా యుద్ధం వ్యాఖ్యలతో సైనిక విజయాలను హైలైట్ చేసినట్లు అవుతుంది. ఇలాంటి వ్యాఖ్యలతో కొన్ని వర్గాల ఓటర్లను తన వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలానే భద్రతా అంశాలను హైలైట్ చేయడం.. గతంలో నెతన్యాహుకు ప్లస్ అయిన సందర్భాలు ఉన్నాయ్.
ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పేజర్‌ను పైకి ఎత్తి చూపిస్తూ నెతన్యాహు ఇచ్చిన వార్నింగ్‌తో.. ప్రపంచం అంతా ఒక్కసారిగా అవాక్కయింది. పేజర్ ఆపరేషన్‌ను గుర్తుచేసుకుంటోంది. హిజ్‌బొల్లా టార్గెట్‌గా లెబనాన్ మీద దాడులు చేపట్టిన ఇజ్రాయెల్.. కీలక నేతలను ఒక్కొక్కరిని లేపేసింది. వెంటాడి వేటాడి మరీ చంపేసింది. హిజ్‌బొల్లా దాదాపు పతనావస్థకు చేరింది. ఐతే పేజర్‌ల పేలుడుతోనే.. ఇది మొదలైంది. లెబనాన్‌వ్యాప్తంగా హిజ్‌బొల్లా కార్యకర్తలు, మద్దతుదారులు, ఫైనాన్సియర్ల చేతుల్లో ఉన్న దాదాపు 5వేల పేజర్లు ఒకే సమయంలో బాంబుల్లా పేలాయ్. ఈ దాడుల్లో 30మందికి పైగా చనిపోగా.. 3వేల మందికి పైగా గాయాలయ్యాయని అప్పట్లో తేలింది. ఇక చాలామంది తమ అవయవాలను, కంటి చూపుని పోగోట్టుకున్నారు. ఈ ఆపరేషన్ వెనక మొసాద్ కీలక పాత్ర పోషించింది. పేజర్‌లతో హిజ్‌బొల్లాను చావు దెబ్బతీయడం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గూఢచార ఏజెన్సీలను ఆశ్చర్యపరిచింది. మొసాద్ గ్రేటెస్ట్ ఆపరేషన్స్‌లో.. ఇప్పటికీ ఈ పేజర్ ప్లాన్ టాప్‌లో ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
పక్కా ప్లాన్‌తో తమ ఉచ్చుల్లో హిజ్‌బొల్లా చిక్కుకునేలా చేసిన మొసాద్.. ఒక్కసారిగా పేజర్లను పేల్చేసింది. మొబైల్, శాటిలైట్ ఫోన్లు వాడితే ఇజ్రాయిల్ నిఘా సంస్థలు గుర్తిస్తాయని.. పేజర్లను వాడటం మొదలుపెట్టింది హిజ్‌బొల్లా. ఇదే మొసాద్‌కు ఆయుధంగా మారింది. హిజ్‌బొల్లాను దెబ్బతీసింది. 2024 ఫిబ్రవరిలో AR 924 అనే రకం పేజర్లను.. దాదాపు 5వేల మంది హిజ్‌బొల్లా కొనుగోలు చేసింది. వీటిని మధ్యస్థాయి కమాండర్లు, ఇతర సహాయక సిబ్బందికి పంపిణీ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 17న అసలు ఆపరేషన్ మొదలైంది. మొసాద్ రిమోట్‌గా పేజర్లను యాక్టివేట్ చేసింది. పేజర్లను తయారు చేసిన తైవాన్‌కి చెందిన గోల్డ్ అపోలోతో సంబంధం ఉన్న మార్కెటింగ్ అధికారి ద్వారా.. హిజ్‌బొల్లాకి వీటికి విక్రయించేలా చేశారు. ఐతే ఆ వ్యక్తి మొసాద్ తరఫున పనిచేస్తున్నట్లు హిజ్‌బొల్లా నాయకులకు తెలియదు.. తెలుసుకునేలోపు విధ్వంసం జరిగిపోయింది. AR924 పేజర్ అద్భుతం అని మార్కెటింగ్ చేశారు. దీంతో ఈ ఆఫర్‌ని హిజ్‌బొల్లా అందుకుంది. బ్యాటరీ ప్యాక్‌లోనే పేలుడు పదార్ధాలను ఉంచారు.
నెతన్యాహు ఆమోదంతో.. లెబనాన్‌లో ఒకే సమయంలో పేజర్లు టపాసుల్లా పేలాయ్. దీని తర్వాత వాకీ టాకీలు, సోలార్ ప్యానెళ్లు, ఇతర ఎలక్ట్రిక్ డివైజెస్ కూడా పేలాయ్. పేజర్ల పేలుడు వ్యూహం చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. పేజర్లలో 3 గ్రాముల కన్నా చిన్న పేలుడు పదార్థాలను అమర్చింది మొసాద్. పేజర్లకు ఓ కోడెడ్ మెసేజ్ పంపించడం ద్వారా ఒక్కసారిగా పేలాయ్. ఈ పేలుళ్లను రిమోట్ ద్వారా ఆపరేట్ చేసింది మొసాద్. పేజర్లతో పాటు.. వాకీటాకీలను ఎలక్ట్రానిక్ సిగ్నల్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఉపయోగించి రిమోట్‌గా పేల్చివేశారనే అభిప్రాయాలు వినిపించాయ్. ఐతే ఈ ఘటన మాత్రం మొసాద్ స్థాయి ఏంటి.. ఆ సంస్థ ఎంత ప్రమాదకరమో ప్రపంచానికి పరిచయం చేసింది. నిజానికి అంతకుముందు కూడా మొసాద్ ఇలాంటి ప్రమాదకరమైన ఆపరేషన్స్ చేపట్టింది. ఆపరేషన్ ఫినాలె, ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్, ఆపరేషన్ సిరియా, మిషన్ ఇరాన్‌లాంటి వాటికి మించి పేజర్ ఆపరేషన్ మొసాద్‌ను చరిత్రలో నిలిచిపోయేలా చేసిందనే అభిప్రాయాలు వినిపించాయ్ అప్పట్లో.
ఇప్పుడు ఆ ఆపరేషన్‌ను గుర్తు చేస్తూ.. నెతన్యాహు పేజర్‌ను చూపించడం సంచలంగా మారింది. లెబనాన్‌లోని హిజ్‌బొల్లా దారుణంగా దెబ్బతినడానికి పేజర్ అటాక్ కూడా ఒక కారణం. అలాంటిది బీపర్లు గుర్తున్నాయా అంటూ ఇప్పుడు నెతన్యాహు ఆ ఘటనను గుర్తు చేయడం.. ప్రపంచానని గగుర్పాటుకు గురి చేసింది. మరి ఈ వ్యాఖ్యల వెనక నెతన్యాహు వ్యూహం ఏంటి.. రాజకీయంగా ప్లస్ అవుతుందని ఇలాంటి సంచలన కామెంట్లు చేశారా.. లేదంటే హిజ్‌బొల్లాకు మరో హెచ్చరిక జారీ చేశారా.. రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ అడుగులు ఎలా ఉండబోతున్నాయ్.. మరో సంచలనం చూస్తామా అనే చర్చ భౌగోళిక రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
