Iran Vs Israel War
Iran Vs Israel War : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అదేసమయంలో ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలు టార్గెట్‌గా ఇరాన్ బాంబుల మోత మోగిస్తుంది. ఈ క్రమంలో యుద్ధం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా పరిణామాలతో చమురు ధరలతో పాటు గ్యాస్, పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. యుద్ధం మరోవారం రోజులపాటు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2024 జులై తరువాత మంగళవారం చమురు ధరలు దాదాపు 8శాతం పెరిగి అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. యుద్ధం తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో చమురు, గ్యాస్ ఇంధన రవాణాకు అంతరాయం కలిగి, దీర్ఘకాలిక సంఘర్షణ భయాలను పెంచింది. అయితే, చమురు ధరల పెరుగుదలపై తాజాగా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో సమావేశానికి ముందు ఆయన ఓవల్ కార్యాలయంలో చమురు ధరల పెరుగుదలపై స్పందించారు. ఇరాన్ పై సైనిక కార్యకలాపాలు ముగిసిన వెంటనే చమురు ధరలు తగ్గుతాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, ఇరాన్ పై అమెరికా దాడులను ఎప్పుడు నిలిపివేస్తుందని ట్రంప్ పేర్కొనలేదు. ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలనుబట్టి చూస్తే.. మరో వారంపదిరోజులు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయని తెలుస్తోంది. అదేజరిగితే.. చమురుతోపాటు ఇతర వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని భారత్ సహా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ప్రతిగా తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా పిలిచే హార్మోజ్ జల సంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ జలసంధి గుండా నౌకలు వస్తే నిప్పుపెట్టి కాల్చివేస్తామని హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో హొర్ముజ్ మార్గంలో ఇతర దేశాలకు చెందిన 706 నౌకలు నిలిచిపోయినట్లు మారిటైమ్ అనలిటిక్ సంస్థలు విండ్ వర్డ్ , కెప్లెర్ అంచనా వేశాయి.
ప్రపంచ దేశాలు వాడే చమురులో ఐదోవంతు రవాణా హొర్ముజ్ నుంచే జరుగుతున్నది. ఇప్పుడు ఇరాన్ ప్రకటనతో 85 శాతానికి పైగా చమురు సరఫరాపై ప్రభావం పడినట్టు తెలుస్తున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్‌ఎన్‌జీని అత్యధికంగా వినియోగించే భారత్‌తో పాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటొచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.