Pakistan-Afghanistan War : అఫ్గాన్‌లోని ఆస్పత్రిపై వైమానిక దాడులతో పాకిస్థాన్ విధ్వంసం.. 400మందికిపైగా మృతి..
Pakistan-Afghanistan War : పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాబూల్‌లోని ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మందికిపైగా మరణించినట్లు అఫ్గానిస్థాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
- Harishth Thanniru
- Published On : March 17, 2026 / 08:23 AM IST
Pakistan Afghanistan War
- అఫ్గానిస్థాన్‌పై విరుచుకుపడిన పాకిస్థాన్
- కాబూల్‌లోని ఓ ఆస్పత్రిపై వైమానిక దాడులు
- 400మందికిపైగా మృతి.. వందలాది మందికి గాయాలు
Pakistan-Afghanistan War : పాకిస్థాన్ – అఫ్గానిస్థాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దళాలు విరుచుకుపడ్డాయి. కాబూల్ లోని ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మందికిపైగా మరణించినట్లు అఫ్గానిస్థాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరో 250మందికిపైగా గాయపడినట్లు పేర్కొన్నాయి.
Also Read : SCB Hospital fire : ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10మంది రోగులు మృతి.. పలువురికి తీవ్రగాయాలు
అఫ్గానిస్థాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాట్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందిస్తున్న కాబుల్‌లోని ఓ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 400మందికిపైగా మరణించారు. భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేసేందుకు రెస్క్యూ టీమ్ కృషి చేస్తుంది. ఆస్పత్రి పూర్తిగా దెబ్బతిన్నది.. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను కూడా వెలికితీస్తున్నాం. వందలాది మంది గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ నేరాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఘోరమైన దాడి అంటూ అఫ్గానిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు.
గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు ఒకరిపైఒకరు వైమానిక దాడులకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్థాన్ వైమానిక దాడులతో అఫ్గానిస్థాన్ లోని పురాతన ఆస్పత్రిపై విరుచుకుపడింది. అయితే, అఫ్గాన్ చేస్తున్న ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. అఫ్గాన్ సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తాము ఖచ్చితమైన దాడులు చేశామని పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులు, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.
