UK Asylum: షాకింగ్.. స్వలింగ సంపర్కులుగా మారుతున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు..! ఎందుకంటే..
ఈ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయిందని మండిపడ్డారు. ఆశ్రయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
- Naveen
- Published on- April 18, 2026 / 11:48 PM IST
UK Asylum: యూకేలో ఒక రహస్య దర్యాప్తులో షాకింగ్ నెట్ వర్క్ బయటపడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారికి యూకేలో ఆశ్రయం కోరేందుకు స్వలింగ సంపర్కులుగా నటించమని శిక్షణ ఇస్తున్నారని రహస్య దర్యాప్తులో తేలింది. వీసాల గడువు ముగియనున్న వలసదారులకు నకిలీ కట్టుకథలు చెప్పి, ఆశ్రయం కోరేందుకు మద్దతుగా కల్పిత ఆధారాలు సృష్టించమని ఆదేశిస్తున్నట్లు తెలిసింది.
“వారు స్వలింగ సంపర్కులమని, పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళితే తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొంటూ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోగలరు” అని ఆ నివేదిక పేర్కొంది. విచారణ ప్రకారం, వలసదారులకు తప్పుడు కేసులు సృష్టించడంలో సాయం చేయడానికి వేల పౌండ్లను వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
నిజమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వారిని రక్షించడానికే యూకే ఆశ్రయ వ్యవస్థ ఉద్దేశించబడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం కావడం వల్ల, తమ స్వదేశాలకు తిరిగి వెళ్లలేని వారికి యూకే ఆశ్రయ ప్రక్రియ రక్షణ కల్పిస్తుంది. అయితే కల్పిత కథనాలు, నకిలీ పత్రాల ద్వారా ఈ రక్షణలను దుర్వినియోగం చేసేలా కొంతమంది దరఖాస్తుదారులను ప్రేరేపిస్తున్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నకిలీ ఆశ్రయ దరఖాస్తులను రూపొందించడానికి లైంగికత, మతం, రాజకీయ వేధింపుల ఆధారంగా చేసే వాదనలతో సహా పలు మార్గాలను గుర్తించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.
ఈ సమస్య పరిమాణంలో చాలా పెద్దదిగా కనిపిస్తోందని.. వీసాల గడువు ముగిసిన వ్యక్తులు ఇప్పుడు ఆశ్రయ దరఖాస్తులలో 35 శాతంగా ఉన్నారని, 2025 నాటికి ఈ దరఖాస్తుల సంఖ్య లక్ష దాటిందని ఆ నివేదిక పేర్కొంది.
అధికారిక సమాచారం ప్రకారం 2023లో లైంగిక ధోరణి ఆధారంగా ఆశ్రయం కోరిన వారిలో అత్యధిక సంఖ్యలో పాకిస్తాన్ ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. నైజీరియా, భారత్, ఉగాండా కూడా అగ్ర దేశాలలో ఉన్నాయి. ఈ వ్యవస్థ దుర్వినియోగంపై చర్యలు తీసుకుంటామని యూకే హోం ఆఫీస్ తెలిపింది. “ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించినట్లు తేలితే, వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా వారిని యూకే నుండి బహిష్కరిస్తారు” అని వెల్లడించింది.
ఈ వ్యవహారంపై ప్రతిపక్ష కన్జర్వేటివ్ నాయకుడు క్రిస్ ఫిల్ప్ తీవ్రంగా స్పందించారు. “ఈ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది. ఆశ్రయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలి. నిజమైన వ్యక్తిగత వేధింపులను ఎదుర్కొంటున్న అతి కొద్ది మందికి మాత్రమే ఆశ్రయం కల్పించాలి” అని అన్నారు.
