పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో అందంగా అలకరించిన ఓ పెళ్లి పందిట్లో పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి పందింట్లో ఓ హిందూ యువతి పెళ్లి జరుగుతోంది. హఠాత్తుగా కొందరు దుండగులు వచ్చారు. ఆ పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. తరువాత జరిగిన పరిణామం పాకిస్థాన్ లోని హిందూ యువతుల పట్ల జరుగుతున్న దారుణాలకు అద్దంపట్టింది.
వివరాల్లోకి వెళితే..కరాచీ నగరానికి 215 కిలోమీటర్ల దూరంలోని సింధ్ రాష్ట్రం మాటియారి జిల్లాలోని హాలా పట్టణంలో 24 ఏళ్ల భారతిబాయి అనే యువతికి హిందూ యువకుడితో పెళ్లి పందిట్లో పెళ్లి జరుగుతుండగా షారుఖ్ గుల్ యువకుడు పోలీసులు, కొంతమంది వ్యక్తులతో వచ్చాడు. బలవంతంగా పెళ్లికూతురు భారతీబాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. తరువాత భారతీబాయిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి బుష్రా అనే పేరు పెట్టి బలవంతంగా పెళ్లి చేసేసుకున్నాడు. తరువాత వారి పెళ్లి జరిగినట్లుగా వివాహ ధ్రువీకరణ పత్రాలను కూడా తీసుకున్నాడు. దీనికి సంబంధించి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భారతిబాయి 2019లో డిసెంబరు 1న ఇస్లాం మతంలోకి మారినట్లు మతమార్పిడి పత్రాలో ఉంది. మతం మారిన అమ్మాయి హిందూ పద్దతి ప్రకారం వివాహం చేసుకుంటోందని అందుకే తాను భారతిని పెళ్లి మండపం నుంచి ఎత్తుకెళ్లామని షారుఖ్ గుల్ అంటున్నాడు. భారతి ఇస్లాం మతంలోకి మారిన ఆమెకు బుష్రా అని కొత్త పేరు పెట్టినట్లు కరాచీలోని జమాయత్ ఉల్ ఉలూమ్ ఇస్లామియా ధ్రువీకరణ పత్రం జారీ చేసింది. భారతి మతం మార్పిడికి తాను సాక్షిగా సంతకం కూడా చేశానని ముఫ్తీ అబూబకర్ సయీద్ఉర్ రెహమాన్ తెలిపారు.
కాగా..తన కూతురు ఇస్లాం మతం తీసుకోలేదనీ..పెళ్లి పందిట్లో నుంచి తన కూతుర్ని షారుఖ్ గుల్ కిడ్నాప్ చేసి మతం మార్పించి పెళ్లి చేసుకున్నాడని భారతిబాయి తండ్రి కిషోర్ దాస్ ఆరోపిస్తున్నారు. తన కూతురు భవిష్యత్తుపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే షారుఖ్ గుల్ వాదన మరోలా ఉంది. భారతిబాయి అలియాస్ బుష్రా తన భార్య అనీ..ఆమెను ఓ హిందూ వ్యక్తితో పెళ్లి జరిపిస్తున్నారని తన భార్యను తాను దక్కించుకునేందుకు పోలీసుల సపోర్ట్ తోనే తాను భారతిని తీసుకొచ్చాననీ అంటున్నాడు. కాగా పెళ్లి పందిట్లో హిందూ యువతిని ఎత్తుకెళ్లి మతం మార్పించి పెళ్లాడిన ఘటన పాకిస్థాన్ హిందూ సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పాక్ లో మైనారిటీలైన హిందువులకు భద్రత కల్పిస్తామని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఇచ్చిన హామీని హిందూ మైనారిటీలు ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.