Plague: మహమ్మారి మళ్లీ వస్తోందా? ల్యాబ్ నుంచి ప్లేగు బ్యాక్టీరియా లీక్.. ఈ వ్యాధి సోకితే కనిపించే లక్షణాలు ఏంటి?
Plague - Russia : రష్యాలోని సైబీరియా ప్రాంతంలో.. అత్యంత ప్రమాదకరమైన ప్లేగు వ్యాధి వ్యాప్తికి జరుగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. దీనిపై అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది.
- Harish Thanniru
- Updated on- October 6, 2026 / 03:09 PM IST
Plague Bacteria Leaked From A Lab Symptoms of this Disease
Plague Bacteria Leak : సరిగ్గా ఆరేళ్ల కింద.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేసింది ప్రపంచం. వైరస్ అనే మాట చెప్తే వణుకు పుట్టేంతలా భయం క్రియేట్ అయింది. ఆ మహమ్మారి మిగిల్చిన టెన్షన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ.. మరో కలకలం రేగింది. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో.. అత్యంత ప్రమాదకరమైన ప్లేగు వ్యాధి వ్యాప్తికి జరుగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. దీనిపై అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది. ఇర్కుట్స్క్ రీజియన్‌లోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పని చేస్తున్న దార్యా షిపిలోవా అనే యువ మహిళా ల్యాబ్ టెక్నీషియన్.. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో భయాందోళనలు రెట్టింపు అయ్యాయ్. ల్యాబ్‌లో పరిశోధనలు సాగుతున్న సమయంలో.. ప్లేగు బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలిపోయిందని.. ఆమెకు ప్రాణాంతకమైన నిమోనిక్ ప్లేగ్ ఇన్ఫెక్షన్ సోకిందని.. అదే ప్రాణాలు తీసిందనే ప్రచారం జరిగింది. ఇది ప్రపంచం గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.
Also Read : Karnataka : సీఎం సార్.. ఆరు గ్యారెంటీలు కాదు.. ఏడు గ్యారెంటీలు.. పెళ్లిని కూడా చేర్చాలన్న యువకుడు
పదిరోజుల కింద.. అంటే సెప్టెంబరు 25నే ఇన్‌స్టిట్యూట్‌లో నమూనాలను సేకరిస్తున్న సమయంలో.. సజీవ బ్యాక్టీరియా ఉన్న గ్లాస్ టెస్ట్ ట్యూబ్ ప్రమాదవశాత్తు కిందపడి పగిలిపోయిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని షిపిలోవా స్వయంగా వైద్య సిబ్బందికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత నాలుగు రోజులకే.. అంటే సెప్టెంబర్ 29న ఆమె తీవ్రమైన నిమోనియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ అక్టోబర్ ఒకటిన చనిపోయింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. ఆమెతో సంబంధం ఉన్న దాదాపు 200 మందికి పైగా వ్యక్తులను క్వారంటైన్‌కు పంపించారు. ముందుజాగ్రత్త చర్యగా.. 5 ఆసుపత్రులను మూసివేసి, అత్యవసర వైద్య పర్యవేక్షణను ప్రారంభించారు. ఐతే వ్యాధి వ్యాప్తిపై జరుగుతున్న ప్రచారాన్ని.. రష్యా అధికారులు ఖండిస్తున్నారు. ఇది అపరిచిత కారణాలతో వచ్చిన సాధారణ నిమోనియా అంటున్నారు. చనిపోయిన సైంటిస్టు వృత్తిపరమైన పరిశోధనలకు సంబంధించిన ఎలాంటి ప్రమాదకర సూక్ష్మజీవులు నమూనాల్లో బయటపడలేదని, ఇన్‌స్టిట్యూట్‌లోని ఇతర ఉద్యోగులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకలేదని చెప్తున్నారు.
యువ సైంటిస్టు మరణం.. ఆ తర్వాత ఘటనపై.. రష్యా అధికారులు క్రిమినల్ విచారణకు ఆదేశించారు. ఇక అటు ప్రయోగశాలలోని పని ప్రదేశంలో భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి వ్యాధి వ్యాప్తి చెందలేదని అధికారులు చెప్తున్నా.. ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐతే సైంటిస్టు మరణంతో.. నిమోనిక్ ప్లేగుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అది అత్యంత వేగంగా వ్యాపించే, ప్రాణాంతకమైన రకం. ఇన్ఫెక్షన్ సోకిన 24 గంటల్లోనే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, దగ్గు, రక్తం పడటంలాంటి లక్షణాలు కనిపిస్తాయ్. బాధితుల నుంచి గాలి ద్వారా సులభంగా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. మొదటి 24గంటల్లో సరైన చికిత్స అందకపోతే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయ్. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. రష్యాలో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మళ్లీ కరోనా నాటి భయాలను గుర్తుకు చేస్తోంది.
రష్యా ల్యాబ్‌లో బ్యాక్టీరియా లీక్ అయిందనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. అక్కడి పరిణామాలను అమెరికా ఆసక్తిగా గమనిస్తోంది. CDC.. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థతో కలిసి అమెరికా విదేశాంగ శాఖ ఈ కేసును ముందుజాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఏమైనా రష్యాలో జరుగుతున్న పరిణామాలు.. ఇప్పుడు ప్రపంచం గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. గతంలో జరిగిన పరిణామాలు తలుచుకొని.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణికిపోతున్నపరిస్థితి కనిపిస్తోంది.
ఎర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణంగా.. ప్లేగు వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి ప్రధానంగా మూడు రకాలుగా ఉంది.. మొదటిది.. బుబోనిక్ ప్లేగు.. ఇది శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థలో కీలకంగా ఉండే లింఫ్ నాణాలను ప్రభావితం చేస్తుంది. రెండోది.. సెప్టిసీమిక్ ప్లేగు. ఇది రక్తంలోకి ప్రవేశించి అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. ఇక మూడోది.. ఇప్పుడు చర్చ జరుగుతున్న న్యూమోనిక్ ప్లేగు. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినా.. తుమ్మినా బయటకు వచ్చే బిందువుల ద్వారా కూడా మరో వ్యక్తికి సోకుతుంది. చాలా డేంజర్ ఇది. ప్లేగు అనేది కొత్తగా వచ్చిన వ్యాధి కాదు. శతాబ్దాలుగా మానవ చరిత్రపై తీవ్ర ప్రభావం చూపింది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో విస్తరించింది. తర్వాత 1346 నుంచి 1353 మధ్య.. ఈ మహమ్మారి కారణంగా యూరప్ జనాభాలో దాదాపు 60 శాతం వరకు చనిపోయారని అంచనా. దీనికి బ్లాక్‌డెత్ అని పేరు. ఆ తర్వాత 19వ శతాబ్దం చివరలో చైనాలో ప్రారంభమై.. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. బ్లాక్‌డెత్ స్థాయిలో గత వందేళ్లలో మరో ప్లేగు మహమ్మారి రాలేదు. అలా అని పూర్తిగా అంతరించి పోయినట్లు కూడా కాదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలాంటి కేసులు కనిపిస్తూనే ఉంటాయ్. మడగాస్కర్‌లో ఏటా నమోదవుతాయ్. 2017లో అక్కడ భారీ స్థాయిలో ప్లేగు వ్యాప్తి జరిగింది. ఇక మనదేశంలోనూ 1994లో ప్లేగు భయాలు కనిపించాయ్. సూరత్, బీడ్‌లాంటి ప్రాంతాల్లో ప్లేగు వ్యాప్తి జరిగినట్లు అప్పట్లో ఆందోళన నెలకొంది. ఐతే అది నిజం కాదని.. ఆ తర్వాత పరిశోధనల్లో తేలింది.
ఇక ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ పగలడంతో.. బ్యాక్టీరియా సోకి యువ సైంటిస్టు చనిపోయిందనే ప్రచారం జరుగుతున్న వేళ.. మరో కథనం వెలుగులోకి వచ్చింది. పని మీద బుర్యాతియా అనే ప్రాంతానికి ఆ యువతి వెళ్లి వచ్చిన తర్వాతే.. అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది. ఐతే ఆ ప్రాంత నాయకులు మాత్రం.. అసలు ఆమె తమ ప్రాంతానికే రాలేదని అంటున్నారు. అసలు తమ ఏరియాలో ప్లేగే లేదని అంటున్నారు. దీంతో యువ సైంటిస్టుకు నిజంగా ప్లేగు సోకిందా.. అదే నిజమైతే ఎలా జరిగిందనే చర్చ మొదలైంది. ఐతే ఇప్పుడు మూడు అంశాలు కీలకంగా మారాయ్. ఒకటి.. యువ సైంటిస్టు షిపిలోవా మరణానికి అసలు కారణం ఏంటో నిర్దారించే ల్యాబ్ రిపోర్ట్. రెండు.. ఆమెకు అసలు వ్యాధి ఎలా సోకిందో తెలిపే సమాచారం. మూడు.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న 2వందల మంది ఆరోగ్య పరిస్థితి. వీటి ఆధారంగానే ఈ ప్లేగు వ్యాధి చుట్టూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఐతే సైంటిస్టు షిపిలోవాకు ప్లేగు సోకినట్లు రష్యా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
