New York Archdiocese: చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.6,700 కోట్ల పరిహారం.. చర్చి చరిత్రలోనే అతిపెద్ద సెటిల్మెంట్
అమెరికా(New York Archdiocese) కాథలిక్ చర్చిలో లైంగిక వేధింపులకు గురైన 1,300 మంది బాధితులకు 800 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేందుకు చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది.
New york archdiocese agrees to 800 million dollar sexual abuse settlement with 1300 victims
New York Archdiocese: అమెరికా కాథలిక్ చర్చి చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన న్యాయపోరాటం ముగింపునకు వచ్చింది. చర్చి మతాధికారులు, సిబ్బంది చేతిలో తీవ్ర లైంగిక వేధింపులకు గురైన సుమారు 1,300 మంది బాధితులతో న్యూయార్క్ కాథలిక్ ఆర్చ్డయాసిస్ దాదాపు 800 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.6,700 కోట్లకు పైగా) భారీ పరిహారం చెల్లించేందుకు చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడేళ్లుగా సాగుతున్న ఈ సంక్లిష్ట వివాదానికి తెరపడిందని బాధితుల తరఫు న్యాయవాదులు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఆర్చ్‌బిషప్ రోనాల్డ్ హిక్స్ సైతం మతాధికారులకు పంపిన ఈ-మెయిల్లో ఈ సెటిల్మెంట్ను ధృవీకరించారు. నవంబర్ మొదటి వారంలో ఈ ఒప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు జరగనున్నాయి.
నేరస్థుల పేర్లు బహిర్గతం చేయాలని షరతు.. పారదర్శకతకు కాథలిక్ చర్చి అంగీకారం:
ఈ చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా కేవలం ఆర్థిక పరిహారమే కాకుండా బాధితుల ప్రధాన డిమాండ్లకు ఆర్చ్డయాసిస్ తలొగ్గింది. వేధింపులకు పాల్పడిన నిందితుల సమాచారానికి సంబంధించిన పూర్తి పత్రాలను, వారి పేర్లను బహిరంగంగా వెబ్సైట్లో ప్రచురించేందుకు చర్చి యాజమాన్యం అంగీకరించింది. 2019లో న్యూయార్క్(New York Archdiocese) ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ద్వారా కాలపరిమితితో సంబంధం లేకుండా పాత కేసులపై పిటిషన్లు వేసే వెసులుబాటు లభించడంతో బాధితులందరూ సంఘటితమై ఈ పోరాటం చేశారు. ఈ నిర్ణయంతో చర్చిలో జవాబుదారీతనం పెరుగుతుందని, దివాలా ప్రక్రియలోకి వెళ్లకుండా ఆర్చ్డయాసిస్ను కాపాడుకోవడానికి కూడా ఇది దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికా వ్యాప్తంగా చర్చిలపై వరుస కేసులు.. రూ. వేల కోట్ల నష్టపరిహారం:
అమెరికా కాథలిక్ చర్చిల చరిత్రలో ఇది రెండవ అతిపెద్ద సెటిల్మెంట్గా నిలిచింది. దీనికి ముందు లాస్ ఏంజెల్స్ ఆర్చ్డయాసిస్ 1,000 మంది బాధితులకు 880 మిలియన్ డాలర్లు చెల్లించగా, ఈ ఏడాది జూన్‌లో శాన్ ఫ్రాన్సిస్కో ఆర్చ్డయాసిస్ కూడా 395 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా దశాబ్దాల తరబడి సాగిన సంస్థాగత వైఫల్యాలు, మతాధికారుల లైంగిక వేధింపుల ఘటనలపై బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటంతో కాథలిక్ చర్చిలు వేల కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిణామాలు చర్చిల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా, బాధితులకు కొంతమేర మానసిక ప్రశాంతతను అందిస్తున్నాయని న్యాయవాదులు పేర్కొన్నారు.
