దక్షిణకొరియా ఇస్తోంది : మోడీకి శాంతి బహుమతి

  • Publish Date - February 21, 2019 / 07:00 AM IST

సియోల్ : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని సియోల్ కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు మోడీ. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో పలు ఒప్పందాలపై చర్చలు జరపనున్నారు. ఇదే సందర్భంగా సియోల్ శాంతి పురస్కారాన్ని స్వీకరించనున్నారు మోడీ. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ విలువలను పెంచడంలో చేసిన కృషికి గుర్తింపుగా.. ప్రధాని మోడీకి దక్షిణకొరియా ప్రభుత్వం ఈ శాంతి బహుమతి ఇస్తోంది.
 

ఇండియా-దక్షిణకొరియా బిజినెస్ సింపోజియంలో మోడీ కీలక ప్రసంగం చేయనున్నారు. రెండు దేశాల స్టార్టప్ హబ్ కూడా ప్రారంభం అవుతుంది. భారత్ లో దక్షిణకొరియా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు.. రెండు దేశాల మధ్య వ్యాపార  కార్యకలాపాలు మరింత పెరిగేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని ప్రధాని భావిస్తున్నారు. కింహే నగరంలో దక్షిణకొరియా అధ్యక్షుడితో మోడీ ఫిబ్రవరి 22న  భేటీ కానున్నారు.