బ్రెజిల్‌లో రామ చిలుకను అరెస్ట్ చేశారు పోలీసులు. పంజరంలో పెట్టి చిలుకను కోర్టులో కూడా ప్రవేశపెట్టారు అక్కడి పోలీసులు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నప్పటికీ ఇదే నిజం. మనుషులను అరెస్ట్ చేసినట్లే చిలకను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
అసలు విషయం ఏమిటంటే.. బ్రెజిల్‌లో స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు.. ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్‌ను సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడకు వెళ్లిన పోలీసులకు నిరాశే ఎదురైంది. అందుకు కారణం రామచిలుకే అనే కారణంతో ఆ చిలుకను అరెస్ట్ చేశారు పోలీసులు.
పోలీసులు వస్తున్న సమయంలో లోపల పనిలో ఉన్న స్మగ్లర్లు పోలీసుల రాకను పట్టించుకోలేదు. అయితే అక్కడే ఉన్న చిలుక పోలీసుల రాకను పసిగట్టి.. ‘మమ్మా.. పోలీస్’ అని అరిచింది. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు వేరే దారి గుండా అక్కడి నుంచి పారిపోయారు. లోపలికి వెళ్లి చూసిన పోలీసులు అక్కడ ఎవరూ దొరక్కపోవడంతో నేరస్థులకు సహరించిందన్న అభియోగం కింద చిలుకను అరెస్టు చేసి జైల్లో పెట్టి విచారణ చేపట్టారు.
అయితే అరెస్ట్ చేసిన చిలుక నోరు మెదపలేదని విచారణలో తేలడంతో చిలుకను వదిలిపెట్టాలంటూ జంతు ప్రేమికులు డిమాండ్ చేశారు. జంతు ప్రేమికుల డిమాండ్ మేరకు చిలుకను స్థానిక జంతు ప్రదర్శనశాలకు అప్పగించారు. ఎగరడానికి దానికి 3నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం దానిని వదిలిపెడుతామని జూ అధికారులు వెల్లడించారు.