ఇరాక్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి : ఉన్నతస్థాయి కమాండర్లతో సహా ఎనిమిది మంది మృతి  

  • Publish Date - January 3, 2020 / 06:19 AM IST

ఇరాక్ దేశంలోని రాజధాని నగరమైన బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం (జనవరి 2) తెల్లవారుజామున మూడు రాకెట్లు దాడి చేశాయి. ఈ రాకెట్ దాడిలో,ఇరాన్,ఇరాక్ పారామిలటరీకి చెందిన ఐదుగురు కమాండర్లతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ దాడిలో ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసీం పోలెమన్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాక్ మీడియా తెలిపింది.  పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండ్ అబు మహదీకూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
 
బాగ్దాద్ విమానాశ్రయం కార్గో హాలు వద్ద ఐదుగురు ఇరాక్ మిలటరీకి చెందిన కమాండర్లు ఇద్దరు అతిధులతో కలిసి రెండు కార్లలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు మూడు రాకెట్లతో ఆకస్మిక దాడి చేశారు. ఈ రాకెట్ దాడిలో రెండు కార్లు దహనమయ్యాయి. కార్లలో ఉన్న కమాండర్లు, అతిధులు అక్కడికక్కడే మరణించారు. ఈ దాడి ఘటనలో మరో 9 మంది గాయాలపాలయ్యారు.

ఈ దాడిలో ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ చీఫ్ ఖాసిం సోలేమని ఇరాకీ కమాండర్ అబూమెహదీ అల్ ముహందీస్ లు మరణించారు.ఇరాన్ మద్దతుతో కొందరు ఆందోళనకారులు ఇరాక్ దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి చేసిన ఘటనతో ఇరాక్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాకీ దళాలను మోహరించిన నేపథ్యంలో రాకెట్ దాడి జరగడం విశేషం.