Russia Black Widows : రష్యాలో ‘బ్లాక్ విడోస్’ కలకలం.. పరిహారం కోసం సైనికులతో వివాహాలు..!

Russia black widows : యుద్ధంలో మరణించిన తరువాత ప్రభుత్వం ఇచ్చే భారీ పరిహారాన్ని సొంతం చేసుకునేందుకు కొందరు మహిళలు రష్యా సైనికులను పెళ్లి చేసుకుంటున్నారట.

Russia Black Widows : యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇరు దేశాలు పోటాపోటీగా మిసైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలతోపాటు వేలాది మంది సైనికులు మృత్యువాత పడుతున్నారు. అయితే, ఇలాంటి సమయంలో రష్యాలో విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రష్యాలోని సైనికులను పెళ్లి చేసుకునేందుకు మహిళలు పోటీ పడుతున్నారట. అయితే, వివాహం వెనుక భారీ కుట్రదాగి ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడించాయి.

Also Read : Donald Trump : ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. దర్యాప్తు చేపట్టిన ఎఫ్ఏఏ.. అసలేం జరిగిందంటే?

సీఎన్ఎన్ కథనం ప్రకారం.. యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు రష్యా ప్రభుత్వం భారీగా పరిహారాన్ని అందిస్తుంది. ఒక్కొక్కరికి 50లక్షల రూబుల్స్ (సుమారు 64వేల డాలర్లు) ఒకేసారి పరిహారంగా చెల్లిస్తోంది. దీంతో ఈ మొత్తాన్ని పొందేందుకు కొందరు మహిళలు సైనికులను వివాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

యుద్ధంలో మరణించిన తరువాత ప్రభుత్వం ఇచ్చే భారీ పరిహారాన్ని సొంతం చేసుకునేందుకు కొందరు మహిళలు రష్యా సైనికులను పెళ్లి చేసుకుంటున్నారట. వీరిని బ్లాక్ విడోస్ (Black Widows) అని పిలుస్తున్నారు. యుద్ధానికి వెళ్లే కొద్ది రోజుల ముందు లేదంటే తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను వివాహం చేసుకుని, సైనికుడు మరణిస్తే చట్టపరంగా భార్యగా పరిహారం, ఇతర ఆస్తులపై హక్కు సాధిస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.  దీంతో అసలు కుటుంబ సభ్యులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. సైనికుడు మరణం తరువాత పరిహారం, ఆస్తులపై తల్లిదండ్రులు, పిల్లలు, కొత్త భార్యల మధ్య తీవ్ర వివాదాలు నెలకొంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఓ మీడియా కథనం ప్రకారం.. ఓ మిలిటరీ ఆస్పత్రిలో పనిచేసే నర్సు.. మరణించే పరిస్థితిలో ఉన్న ఐదుగురు గాయపడిన సైనికులను వరుసగా వివాహం చేసుకుని పరిహారం పొందిందనే ఆరోపణలతో ఉద్యోగం కోల్పోయింది. మరో కేసులో.. ఓ సైనికుడి కుటుంబం కోర్టును ఆశ్రయించగా.. డబ్బు కోసమే వివాహం జరిగిందని భావించి ఆ మహిళకు ఉన్న భార్య హోదాను కోర్టు రద్దు చేసింది.

రష్యన్ మీడియా కథనాల ప్రకారం.. కుటుంబ సభ్యులు లేని అనాథ యువకులు, బంధువులులేని సైనికులను లక్ష్యంగా చేసుకుని వివాహాలు జరిపించే ముఠాలు కూడా ఉన్నాయట. సైనికులు యుద్ధంలో మరణిస్తే వారి భార్యలుగా నమోదైన మహిళలు ప్రభుత్వ పరిహారం పొందేలా వారు తెరవెనుక కథ నడుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనల నేపథ్యంలో రష్యాలో సైనికుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం పంపిణీ వ్యవస్థలో లోపాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బూటకపు వివాహాల ద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలపై కఠిన విచారణ చేపట్టాలని ప్రజలు, పలువురు న్యాయ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.