Mayan city in Mexico : మెక్సికోలో తవ్వకాలు..ప్రాచీన మాయన్ నగరాన్ని కనుగొన్న శాస్త్రజ్ఞులు

మెక్సికోలో తవ్వకాలు జరుపుతుండగా ..శాస్త్రజ్ఞులు ప్రాచీన మాయన్ నగరాన్ని కనుగొన్నారు,

Scientists discovered ancient Mayan city in Mexico : సింధు, హరప్పా నాగరికతల తరహాలోనే భూమండలంపై విలసిల్లిన గొప్ప నాగరికతల్లో మాయన్ నాగరికత ఒకటి. అత్యంత మర్మమైన..ఆసక్తికరమైన నాగరికతలలో ఒకటి మాయన్. ఇది దక్షిణ మెక్సికో,మధ్య అమెరికాలో అభివృద్ధి చెందింది.సుమారు 3,000 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. అప్పట్లోనే మాయన్లు గొప్ప నగరాలు నిర్మించి చరిత్రకెక్కారు. కాలగమనంలో ఆ నగరాలన్నీ భూమిపొరల్లో నిక్షిప్తమైపోయాయి. కానీ చరిత్రలో కలిసిపోయిన ఎన్నో రహస్యాలను వెలికితీసి మనకు అందిస్తుంటారు పరిశోధకులు. అలా తాజాగా..పురావస్తు శాస్త్రజ్ఞులు అత్యంత ప్రాచీన మాయన్ నగరాన్ని కనుగొన్నారు. మెక్సికోలోని యుకాటాన్ ద్వీపకల్పంలో మెరిడా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ నగరం వెలుగులోకొచ్చింది.

బయటపడిన ఈ మాయాన్ నాగరికతలో భాగంగా..భవనాలు, పిరమిడ్లు, వివిధ ఆకృతుల్లో ఉన్న కట్టడాలను పరిశోధకులు గుర్తించారు. ఈ నిర్మాణాలన్నీ మాయన్ల స్వాభావిక పూయిక్ శైలిలో ఉన్నాయి. ఈ ఆవిష్కరణ గురించి పురావస్తు శాస్త్రజ్ఞుల బృందంలోని కార్లోస్ పెరెజా మాట్లాడుతూ..ఇక్కడ 4,000 మంది నివసించి ఉండేవారని మేము భావిస్తున్నామని తెలిపారు. ఇది క్రీస్తు శకం 600-900 సంవత్సరాల కాలం నాటిదని భావిస్తున్నామన్నారు. ఇక్కడున్న కొన్ని భవంతుల్లో పూజారులు, రచయితలు, ఇతర కళాకారులు నివసించేవారని, చిన్న భవనాల్లో సాధారణ ప్రజలు నివసించే వారని వివరించారు. మాయన్లు చెకుముకిరాయి సాధనాలను వినియోగించారని తెలిపారు.

అక్కడికి సమీపంలోనే శ్మశాన వాటికను కూడా గుర్తించారు. అంతేకాదు, మాయన్ల సముద్ర జీవనానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లను కూడా పరిశోధకులు వెలికితీశారు. మాయాన్లు వ్యవసాయం చేయటమే కాకుండా..సముద్రంలో చేపల వేట కూడా సాగించి జీవనం సాగించారని పరిశోధకలు వెల్లడించారు.

కాగా..ఈ మాయన్ నగరం బయటపడిన చోట ప్రస్తుతం ఓ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తున్నారు. పట్టణీకరణ పెరిగిపోతున్న క్రమంలో అనేక పురావస్తు చిహ్నాలు ధ్వంసమైపోతున్నాయని.. చెక్కుచెదరని రీతిలో ఉన్న ఈ స్థలం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పురావస్తు శాస్త్రజ్ఞులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు