COVID-19 cases : మళ్లీ కొవిడ్ వచ్చేస్తోందా..? భారీగా పెరుగుతున్న కేసులు.. వారంలోనే 60శాతం పెరుగుదల.. అక్కడ హైఅలర్ట్..
COVID-19 cases : సింగపూర్‌లో ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య 12,700 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి కమ్యూనికబుల్ డిసీజెస్ ఏజెన్సీ (CDA) వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే 58.8శాతం పెరుగుదల నమోదైంది. ఐసీయూలో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు.
- Harish Thanniru
- Published on- May 22, 2026 / 08:35 AM IST
COVID-19 cases
- మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి
- సింగపూర్ లో పెరుగుతున్న కొత్త కేసులు
- వారంలో 59శాతం కేసుల పెరుగుదల
COVID-19 cases : కరోనా (కోవిడ్-19).. ఈ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురవుతారు. 2019 చివరి నుంచి రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కోవిడ్ కారణంగా భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. ప్రజల జీవన విధానాన్ని కోవిడ్ మహమ్మారి పూర్తిగా మార్చేసింది. ఈ వైరస్ కారణంగా భారతదేశంలో లక్షలాది మంది మరణించారు. అయితే, మళ్లీ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సింగపూర్‌లో ఈ కోవిడ్ మహమ్మారి కేసు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
సింగపూర్‌లో ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య 12,700 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి కమ్యూనికబుల్ డిసీజెస్ ఏజెన్సీ (CDA) వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే 58.8శాతం పెరుగుదల నమోదైంది. అంతకుముందు రోజువారీగా 56 కొత్త కోవిడ్ కేసులు ఉండగా.. అది ప్రస్తుతం 73కు పెరిగినట్లు.. ఐసీయూలో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ కాలంలో కోవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం గమనార్హం. ప్రస్తుతానికి ఈ కోవిడ్ కారణంగా ఎలాంటి మరణాలు చోటుచేసుకోలేదని సింపూర్ వైద్యవర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్ మరింత ప్రమాదకరం కాదని సింగపూర్ ప్రభుత్వం పేర్కొంది. అయితే, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బూస్టర్ టీకాలు వేయించుకోవాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించడం, మాస్క్ ధరించడం మంచిదని, అనవసర ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిదని, టీకాలు అప్డేట్ చేసుకోవడం వంటి సూచనలు చేశారు.
