Venezuela Red Sky : వెనెజువెలాలో భయానక దృశ్యం.. నెత్తుటి రంగులోకి మారిన ఆకాశం.. ఆందోళనలో స్థానికులు.. వీడియో వైరల్..
Venezuela Red Sky : నెజువెలాలో ఇటీవల సంభవించిన జంట భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. అయితే, తాజాగా.. ఆ దేశ రాజధానిలో ఆకాశం నెత్తుటి రంగంలోకి మారడంతో.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
- Harish Thanniru
- Published on- July 1, 2026 / 11:46 AM IST
Venezuela Red Sky
- వెనెజువెలాలో భయానక దృశ్యం
- నెత్తుటి రంగులోకి మారిన ఆకాశం
- భయాందోళన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
Venezuela Red Sky : వెనెజువెలాలో ఇటీవల సంభవించిన జంట భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ భూకంపాల కారణంగా దాదాపు 2వేల మంది చనిపోయారు. 10వేల మందికిపైగా గాయాలతో చికిత్స పొందుతుండగా.. ఇంకా వేలాది మంది ఆచూకీ లభించాల్సి ఉంది. వరుస భూకంపాలతో భయంతో వణికిపోతున్న ఆ దేశ ప్రజలను మరో భయానక దృశ్యం ఆందోళనకు గురిచేస్తోంది.
వెనెజువెలా రాజధాని కారకాస్‌లో జూన్ 30వ తేదీ (మంగళవారం) సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా దట్టమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోయింది. దీంతో స్థానికులు ఈ దృశ్యాలను చూసి ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకాశంలో చాలా కిందకు కనిపిస్తున్న ఎర్రటి మేఘాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వరుస భూకంపాల సృష్టించిన వినాశనం నుంచి ఇంకా తేరుకోకముందే ఆకాశం ఇలా నెత్తురు రంగులోకి మారడంతో ఇది రాబోయే వినాశనానికి సంకేతమంటూ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘దేశం దేవుడిని ప్రార్థించాలి’, ‘ఇది మరణానికి సూచన’, ‘ప్రళయం సమీపిస్తోంది’’ అంటూ పోస్టులు చేశారు.
శాస్త్రవేత్తలు ఈ ఘటనపై స్పందించారు. ఆకాశం నెత్తుటి రంగంలోకి మారడం వెనుక ఎలాంటి భయానక పరిస్థితులు లేవని చెబుతున్నారు. రెలీ స్కాటింగ్ (Rayleigh Scattering) అనే వాతావరణ ప్రక్రియతోపాటు సహారా ఎడారి నుంచి వచ్చిన ధూళి కణాలు (Saharan Dust) కలిసి ఈ అరుదైన దృశ్యానికి కారణమయ్యాయని చెబుతున్నారు. సాధారణంగా సూర్యకాంతిలోని నీలం రంగు వంటి చిన్న తరంగదైర్ఘ్యాల కాంతి ఎక్కువగా వ్యాపించడంతో పగటి సమయంలో ఆకాశం నీలంగా కనిపిస్తుంది.
పగటిపూట ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణమయ్యే తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి కిరణాలు ఈ ధూళి కణాల వల్ల పక్కకు చెల్లాచెదురైపోయాయి. కేవలం ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే ఈ ధూళిని దాటుకుని భూమిని చేరడం వల్ల ఆకాశం ఈ రంగులో కనిపించిందని పేర్కొంటున్నారు. అయితే, ఈ దృశ్యం సహజ ప్రక్రియేనని తెలిసినా, ఇటీవల భూకంపాలతో తీవ్ర విషాదంలో ఉన్న వెనెజువెలా ప్రజలు దీనిని ఆ విపత్తుతో అనుసంధానిస్తూ భావోద్వేగానికి లోనవుతున్నారు.
