Dump Yard In Space
Star Link : పరిచయం అవసరం లేని పేరు ఎలాన్ మస్క్. మస్క్ మస్తిష్కంలో పుట్టిన ఈ ఆలోచన.. అంతరిక్షంలో అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో ప్రమాదాన్ని కూడా మోసుకు వస్తుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఆ సంస్థకు చెందిన శాటిలైట్‌లు ఎక్కువగా రాలిపోతున్నాయని.. అంతరిక్షంలో చెత్తగా మారుతున్నాయని.. అది ప్రపంచ మనుగడకే ప్రమాదకరంగా మారిందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. నిజంగా అలా జరుగుతోందా.. స్టార్‌లింక్ శాటిలైట్‌లు ఎందుకు రాలిపోతున్నాయ్. అసలు అంతరిక్షంలో చెత్త ఏంటి..
45వేల కంటే ఎక్కువ మానవ నిర్మిత వస్తువులు..
భూమి చుట్టూ మనుషులు క్రియేట్ చేసిన వ్యర్థాల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం 45వేల కంటే ఎక్కువ మానవ నిర్మిత వస్తువులు.. భూకక్ష్యలో తిరుగుతున్నాయ్. ఈ అంతరిక్ష వ్యర్థాలు రాబోయే రోజుల్లో తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంది. వీటి కారణంగా అంతరిక్షంలో ఇతర ఉపగ్రహాలు, వ్యోమనౌకలు ఢీకొనే ప్రమాదం పెరుగుతోంది. ఒకవేళ ఈ వ్యర్థాలను కంట్రోల్ చేయలేకపోతే.. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం అసాధ్యం కావొచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కెస్లర్ సిండ్రోమ్ గురించి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకసారి మొదలైతే.. అది ఒక గొలుసు చర్యలా కొనసాగుతుంది. ఒక వ్యర్థ వస్తువు మరొక దానిని ఢీకొనడం కారణంగా మరింత ఎక్కువ వ్యర్థాలు ఏర్పడతాయ్. ఇలా నిరంతరాయంగా జరిగే ఢీ కొట్టే పరంపర అంతరిక్షంలో వ్యర్థాల సంఖ్యను విపరీతంగా పెంచుతుంది. ఒకానొక సమయంలో భూమి కక్ష్య అంతరిక్ష ప్రయాణానికి పూర్తిగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.
స్పేస్‌లో స్టార్‌లింక్‌కు సుమారు 9,500 శాటిలైట్‌లు..
ఈ మధ్య చైనా శాటిలైట్ ఒకటి.. స్పేస్‌ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహానికి చాలా దగ్గరగా వెళ్లింది. కేవలం 2వందల మీటర్ల దూరంలో ఇవి తప్పించుకున్నాయ్. అవి కానీ ఢీకొని ఉంటే.. ఇవాళ పరిస్థితి ఇంకోలా ఉండేది. దీంతో ఇప్పుడు అంతరిక్షంలో చెత్త గురించి మళ్లీ చర్చ మొదలైంది. ప్రస్తుతం స్పేస్‌లో స్టార్‌లింక్‌కు సుమారు 9వేల 5వందల శాటిలైట్‌లు ఉన్నాయ్. ఇందులో 4వేల ఉపగ్రహాలను కక్ష్య మార్చాల్సి వచ్చింది. అంటే దాదాపుగా 40శాతం శాటిలైట్‌ల కక్ష్య ఛేంజ్ చేశారు. భవిష్యత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ల సంఖ్య 34వేలకు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయ్. ఇక అటు చైనా కూడా సుమారు 13వేల ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తోంది. వాటితో పాటు భారత్, రష్యా, యూరోపియన్ యూనియన్ కూడా కొత్త ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాయ్. అంతరిక్షం ఇలా నిండిపోతే.. ఇప్పుడు చైనా, స్పేస్ ఎస్క్ శాటిలైట్‌ల మధ్య జరిగిన సంఘటనలే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క ప్రమాదం జరిగినా.. వేల శాటిటైల్‌లు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
స్టార్‌లింక్ ఉపగ్రహాలపై సైంటిస్టులు ఆందోళన ..
అంతరిక్షంలో చెత్త చుట్టూ చర్చ జరుగుతున్న వేళ.. స్టార్‌లింక్‌పై సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలు భూమిపై పడిపోతున్నాయని చెప్తున్నారు. రోజుకు రెండు మూడు శాటిలైట్లు ఇలా రాలుతున్నాయని.. ఈ ఉపగ్రహాల కారణంగా లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో చెత్త పేరుకుపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో కొత్త ఉపగ్రహాలకు చోటే లేకుండా పోతుందని అంటున్నారు. ప్రస్తుతం భూమి చుట్టూ.. 9వేలకు పైగా స్టార్ లింక్ సంస్థకు చెందిన శాటిలైట్లు తిరుగుతున్నాయని.. తన సేవలను విస్తరించేందుకు.. స్టార్ లింక్ మరిన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోందని చెప్తున్నారు. దీంతో భూమి చుట్టూ లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో తిరిగే స్టార్‌లింక్ శాటిలైట్ల సంఖ్య 30 వేలకు చేరనుందని.. వీటికి 20వేల చైనా శాటిలైట్లు కూడా తోడవుతాయని టెన్షన్ పడుతున్నారు.
స్టార్ లింక్ ఉపగ్రహాల జీవిత కాలం 5 -7 ఏళ్లు ..
స్టార్ లింక్ పంపించే ఉపగ్రహాల జీవిత కాలం 5 నుంచి 7 ఏళ్లు ఉంటుంది. కాలంచెల్లిన తర్వాత ఆ ఉపగ్రహాలు.. లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోనే తిరుగుతుంటాయని.. కొన్ని అయితే భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతూ నేల రాలుతాయని సైంటిస్టులు అంటున్నారు. ఈ శాటిలైట్‌ల కారణంగా.. లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో చెత్త పేరుకుపోతుందని, భవిష్యత్తులో కొత్త ఉపగ్రహాలకు చోటులేకుండా పోతుందని హెచ్చరించారు. ప్రపంచం అంతా కమ్యూనికేషన్ స్ట్రాంగ్ చేయాలని స్టార్‌లింక్‌తో మస్క్ పట్టుదలతో ఉంటే.. ఇవి ఇప్పుడు స్పేస్‌లో ప్రమాదాన్ని క్రియేట్ చేస్తున్నాయా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్.
2030నాటికి లక్షకు చేరే అవకాశం..
భూమి దిగువ కక్ష్యలో 40వేలకు పైగా ఉపగ్రహాలు యాక్టివ్‌గా ఉన్నాయ్. 2030నాటికి వీటి సంఖ్య లక్షకు చేరవచ్చని అంచనా. దీంతో అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్ తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాసెస్‌లో కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల విడిభాగాలు, స్పేష్‌క్రాఫ్ట్‌ల శిథిలాలతో.. భూ దిగువ కక్ష్య కాస్మిక్ స్క్రాప్‌యార్డ్‌గా మారింది. ఇప్పుడు స్టార్‌లింక్ ఉపగ్రహాలు భయపెడుతోంది ఇలానే. ఈ అంతరిక్ష వ్యర్థాలు గంటకు సుమారు 18వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదకరంగా మారాయ్. ఈ వేగం బుల్లెట్ స్పీడ్ కంటే ఏడు రెట్లు ఎక్కువ. దీంతో ఈ వ్యర్థాలు.. భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు, శాటిలైట్లకు ప్రమాదకరంగా మారుతున్నాయ్. అంతరిక్ష వ్యర్థాల నిర్వహణపై ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయ్. భూమి దిగువ కక్ష్య.. ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద చెత్త డంప్‌యార్డుగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
అంతరిక్ష వాతావరణాన్నీ మారుస్తున్న గ్రీన్‌హౌజ్ వాయువులు..
వాతావరణ మార్పు ప్రభావాలు.. భూమికే పరిమితం కాదు. ఇవి అంతరిక్షాన్నీ కూడా తాకుతున్నాయని తేలింది. గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు భూ సమీపంలో అంతరిక్ష వాతావరణాన్నీ మార్చేస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయ్. కార్బన్ డయాక్సైడ్, గ్రీన్‌హౌజ్ వాయువులు.. పై వాతావరణం అంటే థర్మాస్పియర్‌ను కుంచించుకునేలా చేస్తాయ్. అలా జరిగితే సాంద్రత తగ్గుతుంది. దీంతో వెదర్ డ్రాగింగ్ తగ్గుతుంది. కాలం చెల్లిన ఉపగ్రహాలను, అంతరిక్ష వ్యర్థాలను కిందికి నెట్టే బలం ఇదే. నిజానికి అంతరిక్ష వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపించడానికి.. శాస్త్రవేత్తలు, సంస్థలు కృషి చేస్తున్నారు. వ్యర్థాలను ట్రాక్ చేయడం, వాటి కదలికలను అంచనా వేయడం.. ఇందులో కీలకం. దీని ద్వారా ఢీకొట్టడాన్ని నివారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయ్. ఇప్పటికే ఉన్న వ్యర్థాలను తొలగించడానికి, భవిష్యత్తులో కొత్త వ్యర్థాలు ఏర్పడకుండా నిరోధించడానికి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. అంతరిక్ష వ్యర్థాల సమస్య అనేది.. ఇంటర్నెషనల్ ప్రాబ్లమ్. దీనిని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు, అంతరిక్ష సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.