Imran Khan: పాకిస్తాన్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు అండగా కపిల్ దేవ్, గవాస్కర్.. ఏం చేశారంటే
ఇమ్రాన్ ఖాన్ దుర్భర పరిస్థితి చూసి మాజీ క్రికెటర్లు చలించిపోయారు. ఆయనతో కలిసి క్రికెట్ ఆడిన వారు ఆవేదనగా ఉన్నారు.
- Naveen
- Published On : February 17, 2026 / 09:56 PM IST
Imran Khan Representative Image (Image Credit To Original Source)
- జైల్లో ఇమ్రాన్ ఖాన్‌కు మంచి సదుపాయాలు, చికిత్స అందించండి
- పాక్ ప్రభుత్వానికి క్రికెట్ దిగ్గజాల లేఖ
- ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా నిలిచిన కపిల్ దేవ్, గవాస్కర్
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో దుర్భర పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం దెబ్బతిందని, కంటి చూపు కూడా మందగించిందని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ కు భారత క్రికెట్ లెజెండ్స్ అండగా నిలించారు. ఇమ్రాన్ కు మద్దతుగా లేఖ రాశారు. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మంచి సదుపాయాలు, చికిత్స అందించాలని పాక్ ప్రభుత్వానికి 14 మంది మాజీ క్రికెటర్లు ‘అంతర్జాతీయ మాజీ క్రికెట్ కెప్టెన్స్’ పేరిట లేఖ రాశారు. వీరిలో భారత లెజెండ్స్ కపిల్ దేవ్, గవాస్కర్ కూడా ఉన్నారు.
పాకిస్తాన్ కు 1992 వరల్డ్ కప్ అందించారు ఇమ్రాన్ ఖాన్. 2018-2022 మధ్య ఆ దేశ ప్రధానిగా ఉన్నారు. అవినీతి ఆరోపణలతో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించిందని, కుడి కన్ను 85శాతం చూపు కోల్పోయిందని ఇటీవల.. ఆయన తరపు న్యాయవాది పాక్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీంతో ఇమ్రాన్ కుటుంబసభ్యులు, అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఇమ్రాన్ ఖాన్ దుర్భర పరిస్థితి చూసి మాజీ క్రికెటర్లు చలించిపోయారు. ఆయనతో కలిసి క్రికెట్ ఆడిన వారు ఆవేదనగా ఉన్నారు. ఈ కష్టకాలంలో ఇమ్రాన్ కు అండగా నిలిచారు. భారత క్రికెట్ హీరోలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 మంది క్రికెట్ దిగ్గజాలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్ ను సొంత దేశస్తులే పట్టించుకోని పరిస్థితుల్లో.. ఊహించని విధంగా మాజీ క్రికెటర్ల నుంచి ఆయనకు మద్దతు లభించింది.
