నువ్వు ఒక వర్గానికి ఆదర్శం అక్క.. మరో మహిళతో భర్తకు అఫైర్.. ఇద్దరి నుంచి నెలకు రూ.85 వేలు వసూలు చేస్తోన్న భార్య..
Woman Rents Cheating Husband : మరో మహిళతో అఫైర్ పెట్టుకున్న భర్త విషయంలో ఓ మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. మోసం చేసిన భర్తను అద్దెకు ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
- Dharani Pilli
- Published On : March 16, 2026 / 05:39 PM IST
thai Woman offers to rent her cheating husband to mistress for Rs 85000 a month after his affair exposed
Woman Rents Cheating Husband : సాధారణంగా భార్యాభర్తలకు సంబంధించి వివాహేతర బంధాల గురించి వెలుగులోకి వస్తే కొన్ని సార్లు సర్దుకుపోవడం జరిగితే.. చాలా సందర్భాల్లో విడాకులకు దారి తీస్తుంది. అయితే థాయిలాండ్‌లో మాత్రం చాలా భిన్నమైన సంఘటన వెలుగు చూసింది. భర్త ఎఫైర్ గురించి తెలుసుకున్న ఓ మహిళ.. నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్ అనేలాంటి నిర్ణయం తీసుకుంది. భర్త మరో మహిళతో సంబంధం కొనసాగించాలనుకుంటే.. ఆ ఇద్దరు ప్రతి నెల తనకు కొంత డబ్బు చెల్లించాలనే కండిషన్ పెట్టింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. భర్తతో ఎఫైర్ లో ఉన్న మహిళ.. ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. ఈ మహిళ నిర్ణయం తెలుసుకున్న జనాలు.. నువ్వు ఒక వర్గానికి ఆదర్శం అక్క.. గొడవలు, డైవర్స్ వేస్ట్.. నీకు ఆదాయం.. వాళ్లకు ఆనందం.. సూపర్ ఐడియా అంటున్నారు.
ఈ ఆసక్తికర ఘటన గురించి థాయ్ టాక్ షో “హోనే-క్రాసే”లో బయటకు వచ్చింది. దీనిలో చెప్పిన దాని ప్రకారం.. ఖున్ క్వాంగ్ అనే మహిళ చదువు అవ్వగానే 21 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. ఇప్పుడు వారికి 8 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అయితే గత కొంత కాలంగా ఆమె భర్త తీరు అనుమానాస్పదంగా మారింది. తరచుగా ఆలస్యంగా రావడం.. కారణం అడిగితే పని ఒత్తిడి అని చెప్పేవాడు. కానీ క్వాంగ్ కి ఒక అనుమానం మొదలైంది. తన భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని భావించింది.
కట్టుబట్టలతో వెళ్లిపోతానన్న భర్త..
2025 సంవత్సరం చివర్లో తన భర్త అఫైర్ గురించి ఆమెకు స్పష్టత వచ్చింది. ఓ రోజు క్వాంగ్ భర్త రాత్రి 1 గంటకు ఇంటికి వచ్చాడు. అంతకు ముందు ఎప్పుడూ అలా జరగలేదు. ఆ రాత్రి ఆమె పలుమార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్‌లోనే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ప్రశ్నించగా, అతను ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు.
ఇప్పటికే క్వాంగ్, కుమారుడి కోసం తాను ఇల్లు, కారు సంపాదించానని.. అప్పులు కూడా తానే తీరుస్తానని.. కట్టుబట్టలతో ఇంటి బయటకు వెళ్లిపోతానని తెలిపాడు. కుటుంబ అప్పులు కూడా తానే తీసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు తాను ధరించిన బట్టలతోనే వెళ్లిపోతానని తెలిపాడు. భర్త అలా ఎందుకన్నాడో తెలుసుకోవాలని భావించి క్వాంగ్ ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించుకుని.. తన భర్తతో అఫైర్ పెట్టుకున్న మహిళకు సంబంధించిన వివరాలు సేకరించింది. ఆమెకు కూడా అప్పటికే వివాహం అయ్యి పిల్లలున్నారని తెలిసింది.
మళ్లీ మొదలుపెట్టిన బంధం..
ఈ క్రమంలో క్వాంగ్ ఆ మహిళ దగ్గరకు వెళ్లి వారి బంధం గురించి ప్రశ్నించింది. అందుకు ఆమె నిజమేనని అంగీకరించింది. ఇప్పుడు తాను భర్తను వదిలేస్తే.. అప్పుల భారం అతడి మీదనే పడుతుందని.. వాటిని తీసుకోవడానికి సిద్ధమేనా అని క్వాంగ్ ఆ మహిళను ప్రశ్నించింది. అందుకు ఆమె నాకేం సంబంధం అని బదులిచ్చింది. ఇకపై క్వాంగ్ భర్తకు దూరంగా ఉంటానని చెప్పింది.
కానీ మళ్లీ కొన్ని రోజుల తర్వాత క్వాంగ్ భర్త, ఆ మహిళ మధ్య బంధం తిరిగి ప్రారంభం అయ్యింది. ఇలా అయితే లాభం లేదనుకున్న క్వాంగ్ ఒక చిత్రమైన కండిషన్ పెట్టింది. భర్త.. సదరు మహిళతో తన అఫైర్ ను కొనసాగించాలనుకుంటే అందుకు తాను అడ్డుపడనని.. ఇందుకు గాను భర్త, అతడి ప్రియురాలు ఇద్దరు కలిసి నెలకు తనకు చెరో 15 వేలు, మొత్తం 30 వేల బాత్ (సుమారు రూ. 85,000) చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆశ్చర్యకరంగా ఆ మహిళ ఈ కండిషన్ కు అంగీకరించింది. అయితే క్వాంగ్ భర్త మాత్రం దీనికి అంగీకరించలేదు.
దీనిపై న్యాయ నిపుణులు మాట్లాడుతూ.. “హస్బెండ్ లీజ్ అగ్రిమెంట్”కు థాయ్ చట్టంలో ఎలాంటి చట్టబద్ధత లేదని.. ఇది సామాజిక నైతిక ప్రమాణాలకు విరుద్ధమని తెలిపారు. కానీ క్వాంగ్ తీసుకున్న నిర్ణయం మాత్రం సూపర్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
