Sahara Desert Tragedy : ఘోర విషాదం.. ఎడారిలో చెడిపోయిన ట్రక్కు.. నీరు దొరక్క 49 మంది మృతి..

Sahara Desert Tragedy : సహారా ఎడారిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తాగేందుకు చుక్క నీరు దొరక్క 49మంది ప్రయాణాలు కోల్పోయారు.

Sahara Desert Tragedy

Sahara Desert Tragedy : సహారా ఎడారిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ఎడారిలో చిక్కుకుపోయింది.. దీంతో రోజుల తరబడి ఎడారిలో ఉండటంతో విపరీతమైన వేడి, ఉక్కపోతతోపాటు నీటి చుక్క దొరక్క ట్రక్కులో ప్రయాణిస్తున్న 49మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ట్రక్కులోనే ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడి అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులంతా నైజర్‌ (Niger)కు చెందిన వారని అధికారులు తెలిపారు.

Also Read : Alcohol Prices Increase : మందు బాబులకు షాకింగ్ న్యూస్.. ఫుల్ బాటిల్‌పై 80.. హై-ఎండ్ కాస్ట్‌లీ బ్రాండ్లపై ఏకంగా రూ.120 పెంపు..? అమల్లోకి ఎప్పటినుండంటే?

పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో ఈద్ అల్ -ఆధా (బక్రీద్)ను జరుపుకునేందుకు ట్రకులో బయల్దేరారు. అస్సామాకా పట్టణానికి పశ్చిమాన సుమారు 80కిలో మీటర్ల దూరంలో సహారా ఎడారిలోని నిర్జన ప్రాంతంలో ఆ ట్రక్కు నిలిచిపోయింది. ట్రక్కును మరమ్మతు చేయడానికి డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారు నిలిచిపోయిన ప్రాంతంలో ఎలాంటి గ్రామాలు లేకపోవటం, ఫోన్ సిగ్నల్ కూడా లేకపోవటంతోపాటు తీవ్ర ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నప్పుడు ట్రక్కు చుట్టూ అనేక మృతదేహాలు కనిపించాయని తెలిపారు.

ట్రక్కులో ప్రయాణిస్తున్న వారిలో ఓ ఇద్దరు నీటికోసం వెతికే ప్రయత్నంలో 50కిలో మీటర్లుకుపైగా నడిచారు. ఆ తరువాత నీరు దొరకే ప్రాంతానికి చేరుకొని.. అక్కడి నుంచి అస్సమాకా పట్టణానికి చేరుకొని అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అప్పటికే 49మంది చనిపోయారు. మృతదేహాలను వెలికితీసి ఎడారిలోనే సామూహిక ఖననాలు నిర్వహించారు. విపరీతమైన వేడి, ఉక్కపోత, తాగేందుకు చుక్కనీరు కూడా లేకపోవటంతో వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

సహాయ బృందాలు తిరిగి వస్తున్న క్రమంలో సమీప ప్రాంతంలో మరో ట్రక్కు కూడా చెడిపోయి నిలిచిపోయినట్లు గుర్తించారు. ఆ ట్రక్కులో ప్రయాణిస్తున్న 60మంది మూడు రోజులుగా ఎడారిలో చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. అదృష్టవశాత్తూ వారికి సమయానికి నీరు అందించి ప్రాణాలు కాపాడగలిగారు.