Russia Ukraine War : ట్రంప్ సంచలన ప్రకటన.. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంధన కాల్పుల విరమణ సాధ్యమేనా?

Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇంధన కాల్పుల విరమణపై ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. జెలెన్‌స్కీ కీలక షరతు, 60 రోజుల కాల్పుల విరమణ డిమాండ్, ఒప్పందం అమలుపై పూర్తి వివరాలివే..

Trump Announces Russia-Ukraine Energy Ceasefire,

  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు..
  • ట్రంప్ ప్రకటనతో యుద్ధానికి ముగింపు పడుతుందా?
  • పుతిన్‌కు జెలెన్‌స్కీ కీలక షరతు..
  • 60 రోజుల కాల్పుల విరమణకు డిమాండ్
  • రష్యా చమురు కేంద్రాలపై దాడులు ఆపుతామన్న జెలెన్‌స్కీ

Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేసే ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఈ కాల్పుల విరమణ వెంటనే అమల్లోకి వస్తుందని, ఇరు దేశాలు నిబంధనలను పాటించాలని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటనపై రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఒప్పందం అమలుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడికాలేదు..

జెలెన్‌స్కీపై ట్రంప్ విమర్శలు :
కాల్పుల విరమణ ప్రకటనకు ముందు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ఆయన తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఉక్రెయిన్‌లో కొత్త నాయకత్వం అవసరమనే అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. మరోవైపు, ఉక్రెయిన్ దళాలు రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై జరుపుతున్న దాడులు ఇంధన ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని ట్రంప్ ఆరోపించారు.

Read Also : CM Revanth Reddy : హైదరాబాద్ డ్రగ్స్‌కు గోవానే అడ్డా..? బీజేపీ పాలనపై సీఎం రేవంత్ ఫైర్..

ఎన్నికలపై జెలెన్‌స్కీ రియాక్షన్ :
ట్రంప్ వ్యాఖ్యలకు జెలెన్‌స్కీ సమాధానమిస్తూ.. తమ దేశ నాయకుడిని ఎన్నుకునే అధికారం ఉక్రెయిన్ ప్రజలకే ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 60 రోజుల పాటు పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించేలా అమెరికా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. భద్రతకు హామీ లభిస్తే.. ఎన్నికల నిర్వహణకు రెడీ అన్నారు. ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు, మార్షల్ లా కారణంగా ఎన్నికలకు అనేక పరిమితులు ఉన్నాయి.

దాడుల నిలిపివేతకు పరస్పర అంగీకారం? :
ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపై రష్యా దాడులు ఆపితే, రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై తమ దాడులను నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఇరు దేశాల నుంచి స్పష్టమైన హామీలు ఉంటేనే ఈ ప్రక్రియ విజయవంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రంప్ ప్రకటన నిజంగా క్షేత్రస్థాయిలో అమలవుతుందా? ఇరు దేశాలు ఇందుకు కట్టుబడి ఉంటాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం కీలకంగా మారాయి. రానున్న రోజుల్లో ఇరు పక్షాల చర్యలే ఈ ప్రకటన యుద్ధ తీవ్రతను తగ్గిస్తుందో లేదో నిర్ణయించనున్నాయి.