Donald Trump
Donald Trump : ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాలపై ఎడాపెడా భారీ సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. అమెరికా చట్ట సభల (కాంగ్రెస్) అనుమతి లేకుండా విధించిన ఆ సుంకాలను రద్దు చేస్తూ తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 6:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. అధ్యక్షుడి అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగిస్తూ ప్రతీకారం సుంకాలు విధించడాన్ని కూడా ధర్మాసనం తప్పుబట్టింది.
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. దేశానికే అవమానకరం అని, ఆ జడ్జీలను చూసి సిగ్గుపడుతున్నా అంటూ వ్యాఖ్యానించారు. వారితీర్పు నన్ను తీవ్రంగా నిరాశపర్చిందన్న ట్రంప్.. ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైనట్లుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, వివిధ దేశాలపై సుంకాల విధింపులో వెనక్కి తగ్గేదే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ)లోని సెక్షన్ 122ని ఉపయోగిస్తూ ప్రపంచ దేశాలపై అదనంగా 10శాతం సుంకం విధిస్తానన్న ట్రంప్.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను పరిశోధించడానికి సెక్షన్ 301 ఉపయోగించి సుంకాలను పునరుద్ధరించడానికి కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తానని పేర్కొన్నారు. అయితే, భారత దేశంతో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో సుంకాల విధింపుపై ట్రంప్ వెనక్కి తగ్గబోరని అమెరికా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, సుప్రీం తీర్పుతో ఇదివరకటి అంతటి దూకుడుతో కాకుండా కాస్త నెమ్మదించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తున్న వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామనే హామీతో ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
భారత్‌తో ఒప్పందంలో ఎలాంటి మార్పులుండవ్.. ట్రంప్
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో భారతదేశంతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత ట్రంప్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పంధంపై దీని ప్రభావం ఉంటుందా అని ప్రశ్నించగా.. ఎలాంటి మార్పులు ఉండవు. భారత్ టారిఫ్‌లు చెల్లిస్తారు. మేము మాత్రం చెల్లించబోం. గతంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేది. అమెరికా కంటే భారత్‌కే ఎక్కువ లాభం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితిని రివర్స్ చేశాం. మోదీ గొప్ప జెంటిల్‌మ్యాన్. చాలా తెలివైన వ్యక్తి. భారత్‌తో మా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి మొదటి వారంలో భారత్-అమెరికా మధ్య కుదిరిన ఓ వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భారత ఎగుమతులపై సుంకాన్ని 50శాతం నుండి 18శాతంకి తగ్గించారు. ఇప్పుడు ఈ 18శాతం టారిఫ్ కొనసాగుతుంది.