US Iran War: అమెరికా ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం.. 48 గంటల్లో ఎండ్ కార్డ్..!
ఇరాన్ పై విధించిన ఆంక్షలను సడలించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేసిన బిలియన్ల డాలర్ల ఇరాన్ నిధులను క్రమంగా విడుదల చేయడానికి అమెరికా కట్టుబడి ఉంది.
- Naveen
- Updated on- May 7, 2026 / 07:18 PM IST
US Iran War: అమెరికా ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగింపుపై ఇరు దేశాల మధ్య చర్చలు కొలిక్కి వచ్చినట్లుగా కథనాలు వస్తున్నాయి. మరో 48 గంటల్లో ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరుపక్షాల మధ్య 14 అంశాలతో కూడిన ఒక అవగాహన ఒప్పందం రూపొందినట్లు తెలుస్తోంది. ఇరాన్ నాయకత్వం 48 గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించవచ్చని సమాచారం. హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవబోతోందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. అంతేకాక అణు కార్యక్రమం నిలిపివేసేందుకు ఇరాన్ అంగీకారం తెలిపినట్లుగా సమాచారం.
ఇక ఇదంతా కొలిక్కి వచ్చాక యుద్ధాన్ని ముగించేందుకు అధికారిక ప్రకటన రాబోతోంది. ఇరాన్ పై ఆంక్షల తొలగింపు, అణు కార్యక్రమం నిలిపివేత, హర్మూజ్ జలసంధిపై లోతైన చర్చలకు 30 రోజుల గడువు ప్రధాన అంశాలుగా ప్రతిపాదిత ఒప్పందం రూపొందించినట్లుగా తెలుస్తోంది. అణు కార్యక్రమాన్ని ఇరాన్ తాత్కాలికంగా నిలిపివేయచ్చు. ఇందుకు ప్రతిగా ఇరాన్ పై విధించిన ఆంక్షలను సడలించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేసిన బిలియన్ల డాలర్ల ఇరాన్ నిధులను క్రమంగా విడుదల చేయడానికి అమెరికా కట్టుబడి ఉంది. ఇక హార్ముజ్ జలసంధిని దిగ్బంధం చేస్తూ చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను అటు అమెరికా నిలిపివేసింది.
ఇరాన్ తో జరుగుతున్న చర్చల్లో మంచి పురోగతి సాధించినట్లుగా ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అమల్లోకి తీసుకొచ్చింది. అదే సమయంలో ఇరాన్ కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది అమెరికా. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ నిరాకరిస్తే గతంలో కంటే భీకరమైన దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.
Also Read: మేలో ఎలక్ట్రిక్ కార్ల జాతరే జాతర! కొత్త EVలు వచ్చేస్తున్నాయ్.. రేంజ్ చూసి షాక్ అవ్వాల్సిందే!
