DHS immigration Taj Mahal : ఇండియాకు వెళ్తారా.. ఫ్రీ ఫ్లైట్ టికెట్, రూ.2 లక్షల నగదు.. వివాదాస్పదంగా మారిన ట్రంప్ సర్కార్ నిర్ణయం

DHS immigration Taj Mahal : అక్రమ వలసదారుల కోసం ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన ఓ ఆఫర్ ఇప్పుడు వివాదాన్ని రాజేసింది. ఇది ఇండియాను అవమానించడమే అంటున్నారు.

US DHS self deportation scheme illegal immigrants campaign features Taj Mahal landmarks sparking debate

DHS immigration Taj Mahal : రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అమెరికాలో అక్రమ వలసదారులు మొదలు వెనెజులా అధ్యక్షుడిని బంధించడం, తాజాగా ఇరాన్ పై దాడులు.. ఇలా ప్రతి అంశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ అక్రమ వలసదారుల కోసం ప్రకటించిన ఓ ఆఫర్ వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలు..

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపేందుకు ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. “ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, అక్రమ వలసదారులు తమంతట తాముగా దేశం విడిచి వెళ్తే (సెల్ఫ్ డిపోర్టేషన్) వారికి భారీగా నగదు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. బలవంతపు అరెస్టులు, బహిష్కరణల కంటే ఈ పద్ధతి చాలా మంచిదని.. దీని ద్వారా వలసదారులను గౌరవప్రదంగా అమెరికా నుంచి వారి స్వదేశాలకు పంపవచ్చని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.

సీబీపీ హోమ్ మొబైల్ యాప్ (CBP Home Mobile App) ద్వారా ఉచిత ప్రయాణంతో పాటు, 2,600 డాలర్ల ఎగ్జిట్ బోనస్‌ను పొందేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అవకాశం కల్పిస్తోంది. అంటే అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారు తిరిగి వారి స్వదేశానికి వెళ్తే.. 2 లక్షలకు పైగా నగదు ఇస్తామని ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమం ద్వారా అక్రమ వలసదారులు వారి స్వదేశం వెళ్లేందుకు అయ్యే విమాన ఖర్చులను కూడా అమెరికా ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చింది.

దీనికి సంబంధించి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిలో ఇండియాను ప్రతిబింబించేలా తాజ్ మహల్‌తో పాటు చైనా, కొలంబియా దేశాలకు చెందిన ఫోటోలతో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిలో అధికంగా ఇండియా, చైనా, కొలంబియా నుంచి వచ్చిన వారే ఉన్నారని చెప్పడమే అమెరికా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అంటున్నారు. ఈ చర్యల ద్వారా మరోసారి ట్రంప్ ప్రభుత్వం ఇండియాను టార్గెట్ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని భావించిన వారు ‘CBP Home’ మొబైల్ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. వీటిని పరిశీలించిన తర్వాత.. అమెరికా ప్రభుత్వం వారికి ఉచితంగా టికెట్ బుక్ చేస్తుంది. వలసదారులు తమ స్వదేశానికి చేరుకున్నట్లు ఈ యాప్ ద్వారా నిర్ధారించిన తర్వాత ప్రోత్సాహక నగదును వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటికే సుమారు 19 లక్షల మంది ఈ పథకాన్ని వాడుకున్నారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.