South Korea Divorce Case : భర్త ఎఫైర్.. భార్యకు జాక్పాట్..! కోర్టు తీర్పుతో రూ.5,500 కోట్ల భరణం.. ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన విడాకుల తీర్పు!
South Korea Divorce Case : దక్షిణ కొరియాలో అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా నిలిచిన డివోర్స్ ఆఫ్ ది సెంచరీలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
SK Group chairman Chey Tae-won and his former wife Roh Soh-yeong
South Korea Divorce Case : దక్షిణ కొరియాలో అత్యంత ఖరీదైన విడాకుల కేసులో (శతాబ్దపు విడాకులు అని పిలుస్తారు) కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఎస్కే గ్రూప్ చైర్మన్ చే టే-వోన్ (Chey Tae-won) తన మాజీ భార్య రో సో-యాంగ్ (Roh So-yeong)కు 944 బిలియన్ వోన్ (సుమారు 640 మిలియన్ డాలర్లు) నగదు రూపంలో చెల్లించాలని సియోల్ హైకోర్టు ఆదేశించింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.5,500 కోట్లు. తీర్పు దక్షిణ కొరియా చరిత్రలోనే అత్యంత భారీ విడాకుల పరిహారాల్లో ఒకటిగా ఇది నిలిచింది.
Also Read : Saudi Prince Abdullah Death : సౌదీ యువరాజు మృతి కేసు.. ఏడాది తర్వాత బయటపడిన అసలు నిజం.. మరణానికి ఇదే కారణం
రో సో-యాంగ్ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రో టే-వూ కుమార్తె. ఆమె, చే టే-వోన్లు 1988లో వివాహం చేసుకున్నారు. అయితే 2015లో చే టే-వోన్ తనకు మరో మహిళతో సంబంధం ఉందని, వారికి ఓ సంతానం కూడా ఉందని బహిరంగంగా ప్రకటించారు. అనంతరం ఇద్దరి మధ్య విడాకుల వివాదం కోర్టుకు చేరింది.
ఈ కేసులో గతంలో కోర్టు మరింత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించినప్పటికీ, సుప్రీంకోర్టు కొన్ని అంశాలను పునఃపరిశీలించాలని సూచించింది. తాజాగా హైకోర్టు విచారణ జరిపి 944 బిలియన్ వోన్ పరిహారాన్ని ఖరారు చేసింది. ఈ మొత్తం నగదు రూపంలోనే చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.
చే టే-వోన్ సంపాదించిన ఆస్తుల పెరుగుదలలో రో సో-యాంగ్ కూడా పరోక్షంగా కీలక పాత్ర పోషించారని కోర్టు అభిప్రాయపడింది. కుటుంబ నిర్వహణతో పాటు సామాజిక, వ్యాపార కార్యక్రమాల్లో ఆమె అందించిన సహకారాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ భారీ పరిహారం నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే ఆమె తండ్రి రో టే-వూ నుంచి వచ్చిన నిధులు ఎస్కే గ్రూప్ ఎదుగుదలకు కారణమయ్యాయన్న వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ తీర్పుపై చే టే-వోన్ మరోసారి దక్షిణ కొరియా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ విడాకుల కేసు ఇంకా కొనసాగే అవకాశముంది.
