Telangana Drone Academy : డ్రోన్ పైలెట్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ డిమాండ్.. లక్షల్లో సంపాదన..
Telangana Drone Academy : తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ అకాడమీ ద్వారా డీజీసీఏ (DGCA) సర్టిఫైడ్ శిక్షణను అందిస్తోంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్తో పాటు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.
Telangana Drone Academy Drone Pilot Training Course
Telangana Drone Academy : సినిమాల్లో కనిపించే అద్భుతమైన డ్రోన్ షాట్లు, రాజకీయ ర్యాలీల్లో తీసే ఏరియల్ వీడియోలు చూసి చాలా మంది డ్రోన్ ఎగరేయాలని అనుకుంటుంటారు. అయితే డ్రోన్‌ను ప్రొఫెషనల్‌గా నడపడం ఒక ప్రత్యేక నైపుణ్యం. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ అకాడమీ ద్వారా డీజీసీఏ (DGCA) సర్టిఫైడ్ శిక్షణను అందిస్తోంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్తో పాటు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే, ఆధాయం విషయానికి వస్తే.. డ్రోన్ పైలెట్ ఆదాయం మీరు ఎంచుకున్న రంగాన్ని బట్టి మారుతుంది. వేలల్లో నుంచి లక్షల్లో కూడా ఆదాయం లభిస్తుంది.
డ్రోన్ అకాడమీలో ఏం నేర్పిస్తారు?
డ్రోన్ అంటే కేవలం ఒకే రకం కాదు. వినియోగాన్ని బట్టి అనేక రకాల డ్రోన్లు ఉంటాయి. వాటి పనితీరు, వినియోగం, భద్రతా నియమాలు, ఆపరేషన్ విధానాలపై పూర్తి స్థాయి శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి సర్టిఫికెట్ అందుతుంది. దేశంలో విమాన పైలెట్లకు కూడా ఇదే సంస్థ గుర్తింపు ఇస్తుండటంతో ఈ సర్టిఫికెట్‌కు మంచి ప్రాధాన్యం ఉంది.
ఎలా అప్లయ్ చేసుకోవాలి..?
తెలంగాణ ప్రభుత్వం దీనికోసం ఒక వెబ్సైట్ (https://droneacademy.telangana.gov.in/) తీసుకొచ్చింది. ఈ వెబ్ సైట్ లోకి వెళితే మీకు అందులో ఆప్షన్స్ వస్తాయి.
అందులో Enroll ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ సంస్థ అందిస్తున్న కోర్సుల డిటెయిల్స్ కనిపిస్తాయి.
అందుబాటులో ఉన్న కోర్సులు..
డీజీసీఏ సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ (Small & Medium)..
ఈ కోర్సులో చిన్న, మధ్య తరహా డ్రోన్లను సురక్షితంగా టేకాఫ్, ల్యాండింగ్, టర్నింగ్ చేయడం నుంచి పూర్తి స్థాయి ఆపరేషన్ వరకు నేర్పిస్తారు. డ్రోన్ పైలెట్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఉత్తమ కోర్సు.
రెండు రోజుల డ్రోన్ వర్క్‌షాప్..
ఇప్పటికే డ్రోన్ ఎగరేయడం తెలిసిన వారికి అడ్వాన్స్డ్ టెక్నిక్స్, కొత్త మోడళ్లపై అవగాహన కల్పించే శిక్షణ.
అగ్రికల్చర్ స్ప్రేయింగ్ ట్రైనింగ్..
వ్యవసాయ డ్రోన్ల ద్వారా పురుగుమందులు, ఎరువులు పిచికారీ చేసే విధానం నేర్పిస్తారు. డ్రోన్ ట్యాంక్ నింపడం, సమానంగా స్ప్రేయింగ్ చేయడం, సురక్షిత వినియోగంపై శిక్షణ ఉంటుంది.
ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV) డ్రోన్ పైలెట్ ట్రైనింగ్..
డ్రోన్ కెమెరా ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించే విధానం నేర్పిస్తారు. పోలీస్ శాఖ, రాజకీయ ర్యాలీలు, పెళ్లిళ్లు, ఈవెంట్లు, వీడియో షూటింగ్‌లకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
డ్రోన్ డేటా ప్రాసెసింగ్, సర్వే & మ్యాపింగ్..
డ్రోన్ ద్వారా భూసర్వే, మ్యాపింగ్, డేటా విశ్లేషణ వంటి నైపుణ్యాలు నేర్పిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ప్రభుత్వ సర్వేల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది.
అగ్రి డ్రోన్ అసెంబ్లీ & రిపేర్..
వ్యవసాయ డ్రోన్లను అసెంబుల్ చేయడం, లోపాలు గుర్తించడం, మరమ్మతులు చేయడం వంటి సాంకేతిక శిక్షణ అందిస్తారు.
మ్యాపింగ్‌కు భారీ డిమాండ్..
డ్రోన్ రంగంలో అత్యధిక అవకాశాలు ఉన్న విభాగాల్లో డ్రోన్ మ్యాపింగ్ ఒకటి. భూముల విస్తీర్ణం, వ్యవసాయ క్షేత్రాలు, నిర్మాణ స్థలాల సర్వే, మ్యాపింగ్ వంటి పనులు ఇందులో భాగం. సాంకేతిక పరిజ్ఞానం, విశ్లేషణా నైపుణ్యం ఉన్న వారికి ఈ విభాగంలో మంచి ఆదాయం, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
