EB-1 Green Card : అమెరికాలోని భారతీయులకు మరోషాక్.. సెప్టెంబర్ 30లోపే EB-1 కోటా ఖాళీ?
EB-1 Green Card : అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డు) కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మరోసారి షాక్ తగిలింది.
- Harish Thanniru
- Published on- September 8, 2026 / 02:17 PM IST
EB1 Green Card
EB-1 Green Card : అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డు) కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మరోసారి షాక్ తగిలింది. భారతీయులను ఉద్దేశించిన ఈబీ-1 ((Employment-Based First Preference) గ్రీన్‌కార్డ్ కేటగిరీ సెప్టెంబర్ 30లోపే అందుబాటులో లేకుండా పోయే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. అధిక డిమాండ్ కారణంగా ఈ కేటగిరీలో భారత కోటా త్వరగా పూర్తయ్యే పరిస్థితి ఏర్పడిందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ తన సెప్టెంబర్ వీసా బులెటిన్‌లో పేర్కొంది.
Also Read : Gold Silver Rates Today : బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి గోల్డ్, సిల్వర్ ధరలు ఇవే..
అమెరికా ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌లో ఈబీ-1 అత్యంత ప్రాధాన్యత కలిగిన కేటగిరీల్లో ఒకటి. అసాధారణ ప్రతిభ కలిగిన నిపుణులు, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రొఫెసర్లు, పరిశోధకులు, అలాగే కొన్ని బహుళజాతి సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లకు ఈ కేటగిరీ ద్వారా గ్రీన్‌కార్డ్ పొందే అవకాశం ఉంటుంది. అమెరికా ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ఈ గడువు ముగుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన ఈబీ-1 వీసా సంఖ్యలో భారతీయుల వాటా అధిక డిమాండ్ కారణంగా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
అయితే, ఇండియాకు కేటాయించిన పరిమితి సెప్టెంబర్ 30లోపు పూర్తయితే ఈబీ-1 కేటగిరీని వచ్చే వారాల్లోనే ‘అన్‌అవైలబుల్’గా ప్రకటించాల్సి రావచ్చు” అని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని కూడా పేర్కొంది. మరోవైపు.. సెప్టెంబర్ వీసా బులెటిన్ ప్రకారం .. ఈబీ-2 కేటగిరీ ఇప్పటికే ‘యూ’ (Unavailable)గా ఉంది. అంటే ఆ కాలంలో ఆ కేటగిరీలో కొత్త వీసా నంబర్లు జారీ చేయడానికి అనుమతి లేదు. అదేవిధంగా ఈబీ-3 కేటగిరీలో ఇండియన్స్‌కు భారీ బ్యాక్‌లాగ్ కొనసాగుతోంది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మొత్తానికి.. ఇప్పటికే ఈబీ-2లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇప్పుడు ఈబీ-1పై కూడా అమెరికా హెచ్చరిక జారీ చేయడం గ్రీన్‌కార్డ్ ఆశావహుల్లో ఆందోళన పెంచుతోంది. సెప్టెంబర్ 30లోపు ఈబీ-1 భారత కోటా పూర్తయితే, తదుపరి ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే వరకు వీసా నంబర్ల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది.
