Iran vs Israel War
Iran vs Israel War : పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. గల్ఫ్ అంతటా యుద్దాగ్ని జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. దీనికి ప్రతిగా గల్ఫ్ లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో విచురుకుపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించాయి.
Also Read : Kakinada Blast: ఒక్కొక్కరికి 20 లక్షలు.. కాకినాడ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరిహారం
‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ పేరుతో అగ్రరాజ్యం చేపట్టిన ఈ దాడులతో దేశమంతా అట్టుడికింది. అయితే, ఈ దాడుల్లో అమెరికా, ఇజ్రాయెల్ అనుకుంత పనిచేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఖతం చేశాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు.. ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని, తమకు తగిన మార్గనిర్దేశం చేస్తున్నారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళం స్పష్టం చేయడం గమనార్హం.
వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు పేర్కొన్నారు. ‘ఇప్పటి వరకూ అందిన సంకేతాల ప్రకారం ఆ నిరంకుశుడు జీవించి ఉండకపోవచ్చు’’ అని నెతన్యాహు తెలిపారు. అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్ లో భాగంగా ఖమేనీ నివాస ప్రాంగణంపై 30 బాబులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ‘‘చరిత్రలో అత్యంత దుర్మార్గుల్లో ఒకరైన ఖమేనీ చనిపోయారు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు.. అమెరికన్లందరికీ, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ప్రజలకు మంచివార్త. ఖమేనీ, అతని ముఠా అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థలను తప్పించుకోలేకపోయారు. ఇరానియన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే ఏకైక గొప్ప అవకాశం.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ పై నిరంతరాయంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయి. ఈ దాడులు వారం, అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగవచ్చునని ట్రంప్ తెలిపారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిచెందినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఖమేనీతోపాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మృతిచెందినట్లు పేర్కొంది. ఖమేనీ మృతి సందర్భంగా దేశంలో 40 రోజుల సంతాప దినాలుగా ఇరాన్ ప్రకటించింది.