×
Ad

US-Israel Attacks Iran : ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఎటాక్ చేస్తే.. ఇరాన్ దుబాయ్, సౌదీ, ఖతార్ మీద ఎందుకు దాడి చేస్తోంది?

US-Israel Attacks Iran : గల్ఫ్ దేశాలు (బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) అమెరికాతో మిత్రత్వం కలిగి ఉన్నాయి. ఈ దేశాల్లోని అమెరికా రక్షణ స్థావరాలు టార్గెట్ గా ఇరాన్ దాడులు చేసింది.

Iran Vs Israel War

  • ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు
  • గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్‌గా క్షిపణుల వర్షం
  • దెబ్బతిన్న పలుప్రాంతాల్లోని విమానాశ్రయాలు, హోటళ్లు, భవనాలు

US-Israel Attacks Iran : ఇరాన్, అమెరికా సైన్యాలు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి. ఈ క్రమంలో ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఖమేనీ మరణించాడు. ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేసింది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పై దాడి చేయగా.. ఇరాన్ మాత్రం గల్ఫ్ అంతటా అమెరికా స్థావరాలపై దాడులకు దిగింది. తద్వారా ప్రాంతీయ ఘర్షణల భయాలను రేకెత్తించింది.

Also Read : Ayatollah Ali Khamenei : ఖమేనీ బయోగ్రఫీ ఇదే.. అమెరికాకే చుక్కలు చూపించిన సుప్రీం లీడర్ చనిపోతే ఇరాన్ జనం సంబరాలు ఎందుకు?

గల్ఫ్ దేశాలు (బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) అమెరికాతో మిత్రత్వం కలిగి ఉన్నాయి. ఇరాన్ ఈ దేశాలను యుద్ధ భూమిగా మార్చింది. ఆ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాలు దాడులకు పాల్పడ్డాయి. పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ ప్రతిదాడులు చేసింది. వీటిలో ఇజ్రాయెల్‌లోని టెల్ నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిర్యా కూడా ఉన్నాయి. పలు దేశాల్లో భారీ పేలుళ్లు జరిగాయి.

దుబాయ్‌లో డ్రోన్లు, మిసైళ్ల దాడి కారణంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బుర్జ్ అల్ అరబ్ హోటళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనల్లో నలుగురు గాయపడ్డారు. అబుదాబీలో ఇరాన్ క్షిపణి దాడుల కారణంగా ఒకరు మరణించారు. దుబాయ్, అబుదాబీ ఎయిర్ పోర్టులు మూసివేశారు. వందలాది ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి.

ఖతార్ గగనతలం ఆదివారం ఉదయం 7.30 సమయంలో పేలుళ్లతో దద్దరిల్లింది. ఖతార్ రాజధాని దోహాలో మొత్తం 11 పేళ్లు జరిగాయి. అయితే, ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ముందస్తుగా భద్రతా ప్రణాళిక ప్రకారం.. దేశంపై దాడులను అడ్డగించామని పేర్కొంది. ఖతార్ భూభాగాన్ని చేరుకోవడానికి ముందే అన్ని క్షిపణులను అడ్డుకున్నామని తెలిపారు. పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినా ఎవరూ గాయాలు కాలేదని నివేదిక పేర్కొంది.

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో విమానాశ్రయ ప్రాంగణం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటన తరువాత విమానాశ్రయం కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బహ్రెయిన్‌ రాజధాని మనామాలో ఉన్న అమెరికా నేవీ 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ క్షిపణి దాడి జరిగింది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన పుటేజీలో ఇరానియన్ షాహెద్ డ్రోన్ సమీపంలోని టవర్ బ్లాక్‌ను ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగినట్లు కనిపించింది. మనామాలోని అనేక నివాస భవనాలు కూడా ఇరాన్ దాడులకు దెబ్బతిన్నాయి. అదేవిధంగా సౌదీ అరేబియాలో ఇరాన్ రియాద్, రాజధానిలోని తూర్పు ప్రాంతాన్ని లక్ష్యం చేసుకొని వైమానిక దాడులకు పాల్పడిందని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపింది.