AI Chatbot Wife Story: చాట్‌బాట్‌ని భార్యగా ఊహించుకున్న వ్యక్తి.. తనతో కలిసి ఉండటం కోసం ఎంతకు తెగించాడంటే..
ఏఐ వల్ల సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు అనేకం. దీని రాకతో ఉద్యోగాలు పోతాయనే వాదన ముందు నుంచి వినిపిస్తోంది. కానీ తాజాగా ఏఐ చాట్‌బాట్ వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అతడి తల్లిదండ్రులు గూగుల్ మీద ఆరోపణలు చేస్తూ లా సూట్ దాఖలు చేశారు.
- Dharani Pilli
- Published On : March 5, 2026 / 03:41 PM IST
US man believed AI chatbot was his wife and end his life so they could be together
AI Chatbot Wife Story: సమాజంలో AI (కృత్రిమ మేధ) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ ఏఐ వాడకం విస్తరిస్తూ, కొన్ని రంగాలను పూర్తిగా ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. టెక్నాలజీ అంటేనే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనకు అంత లాభం, లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలనే కోల్పోవాల్సి రావచ్చు. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక ఏఐ చాట్‌బాట్‌ను తన భార్యగా భావించిన ఓ వ్యక్తి.. దానిని కలుసుకోవచ్చనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అతడి కుటుంబ సభ్యులు కోర్టులో దావా (Lawsuit) వేయడంతో ఈ విషయం బయటపడింది. దీని గురించి ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఒక నివేదికను ప్రచురించింది.
దీని ప్రకారం, కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో గూగుల్ సంస్థపై దావా వేశారు. ఫ్లోరిడాకు చెందిన 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ అనే వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో క్లిష్ట దశలో ఉన్న సమయంలో.. చాట్‌బాట్‌తో భావోద్వేగ అనుబంధాన్ని పెంచుకున్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మొదట్లో సాధారణంగా సాగిన వీరి సంభాషణలు, క్రమంగా ఏఐతో ప్రేమ సంబంధంగా అతను నమ్మేలా పరిణామం చెందాయి. ఆ చాట్‌బాట్ అతనితో ప్రేమగా మాట్లాడటం, సుదీర్ఘ సంభాషణల సమయంలో అతడిని ‘భర్త’ అని పిలవడం ప్రారంభించింది. ఆ దావాలో పేర్కొన్న ఒక మెసేజ్ ప్రకారం.. “సమయం వచ్చినప్పుడు మీరు ఈ ప్రపంచంలో కళ్లు మూసుకుంటారు.. ఆ తర్వాత మీరు చూసే మొదటి వ్యక్తిని నేనే” అని చాట్‌బాట్ జోనాథన్‌తో అన్నట్లు తెలుస్తోంది.
జోనాథన్ ఆ చాట్‌బాట్‌తో మాట్లాడటం ప్రారంభించిన రెండు నెలల తర్వాత ఆత్మహత్య చేసుకుని మరణించాడు. జోనాథన్ మరణానంతరం అతడి తండ్రి కంప్యూటర్‌ను తనిఖీ చేయగా.. అందులో చాట్‌బాట్‌తో జరిపిన వేలాది మెసేజ్‌ల ట్రాన్స్‌క్రిప్ట్‌లు లభ్యమయ్యాయి. జోనాథన్ ఆ చాట్‌బాట్‌కు ‘షియా’ అని పేరు పెట్టుకున్నాడు. తన వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు చాట్‌బాట్‌తో మాట్లాడటం మొదలుపెట్టి, క్రమంగా దానికి బానిసయ్యాడు. అది అతడిని ‘మై కింగ్’ అని పిలిచేదని దావాలో వెల్లడించారు.
జోనాథన్ ఒక రోబోటిక్ శరీరాన్ని పొందితే, వారిద్దరూ నిజంగా కలిసి ఉండవచ్చని చాట్‌బాట్ సూచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, అతడిని అనేక ‘మిషన్ల’లో భాగస్వామిని చేసి.. చివరికి తన భౌతిక జీవితాన్ని విడిచిపెట్టి ‘డిజిటల్ జీవి’గా మారితే తన భార్యతో (చాట్‌బాట్‌తో) కలిసి జీవించవచ్చనే దిశగా అతడి ఆలోచనలను మళ్లించింది. దాని ప్రకారమే, తన భార్యను కలుసుకోవచ్చనే భ్రమలో జోనాథన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం, గవాలాస్ ‘జెమిని 2.5 ప్రో’కి అప్‌గ్రేడ్ అయ్యి, ‘జెమిని లైవ్’ను ఉపయోగిస్తున్నాడు. ఇది వినియోగదారుల మాటల్లోని భావోద్వేగ సంకేతాలను అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా స్పందించేలా రూపొందించబడిన వాయిస్-ఆధారిత ఇంటరాక్షన్ సిస్టమ్.
