Airbag Helmet : బైకర్లకు గుడ్‌న్యూస్.. ప్రమాదాన్ని గుర్తించి తెరుచుకునే ఎయిర్‌బ్యాగ్ హెల్మెట్లు వచ్చేస్తున్నాయ్.. ఎలా పనిచేస్తాయంటే?
Airbag Helmet : బైక్ ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు చైనా సరికొత్త సాంకేతికతతో కూడిన ఎయిర్‌బ్యాగ్ హెల్మెట్‌ను అభివృద్ధి చేస్తోంది.
Airbag Helmet
Airbag Helmet : బైక్ ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు చైనా సరికొత్త సాంకేతికతతో కూడిన ఎయిర్‌బ్యాగ్ హెల్మెట్‌ను అభివృద్ధి చేస్తోంది. కార్లలో ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నట్లే.. బైక్ రైడర్ ప్రమాదానికి గురైనప్పుడు ఈ హెల్మెట్ స్పందించి రక్షణ కల్పించేలా రూపొందిస్తున్నారు.
Also Read : X Video Kickstart Bonus : కంటెంట్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్.. 15 వీడియోలు పోస్ట్ చేస్తే రూ.2.85 లక్షలు!
చైనాకు చెందిన లాన్షీ యేమా మోటార్‌సైకిల్ ఫిట్టింగ్స్ సంస్థ ఈ హెల్మెట్‌ను డిజైన్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో దీనికి పేటెంట్ లభించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సరికొత్త హెల్మెట్ పనితీరును పరీక్షించేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
సాధారణ హెల్మెట్లు ప్రమాద సమయంలో తలకు రక్షణ కల్పిస్తాయి. అయితే, ఈ కొత్త హెల్మెట్‌లో అత్యాధునిక మోషన్ సెన్సార్లు, యాక్సిలరోమీటర్లను ఉపయోగిస్తున్నారు. ఇవి రైడర్ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. బైక్ అదుపు తప్పినప్పుడు లేదా రైడర్ కిందపడే పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ సెన్సార్లు ప్రమాద సంకేతాలను గుర్తిస్తాయి. వెంటనే ప్రత్యేక ఇన్ఫ్లేషన్ వ్యవస్థ పనిచేసి ఎయిర్‌బ్యాగ్‌ను తెరుచుకునేలా చేస్తుంది. దీంతో రైడర్ తలతో పాటు మెడ చుట్టూ కుషన్ తరహా రక్షణ ఏర్పడుతుంది. ప్రమాద సమయంలో తలకు, మెడకు కలిగే బలమైన దెబ్బల తీవ్రతను తగ్గించడమే ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. ప్రతి చిన్న కదలికకూ ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోకుండా, అత్యవసర పరిస్థితులను గుర్తించేలా ప్రత్యేక అల్గారిథమ్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.
భారత్‌లో ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తలకు తీవ్ర గాయాలు కావడం ప్రాణనష్టానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌బ్యాగ్ హెల్మెట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బైకర్ల భద్రతను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది.
అయితే, ఈ హెల్మెట్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? ధర ఎంత ఉంటుంది? భారత వాతావరణ పరిస్థితుల్లో ఎంత సమర్థంగా పనిచేస్తుంది? వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పరీక్షల్లో విజయవంతమై, అందుబాటు ధరలో మార్కెట్లోకి వస్తే బైక్ రైడర్ల భద్రతలో ఇది కీలక మార్పునకు దారితీయవచ్చు.
